ప్రజాశక్తి -రాయచోటి : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గిరీష తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రం రాయచోటిలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని బంగ్లా నుంచి ర్యాలీగా సాయి శుభ కళ్యాణ్ మండపం వద్దకు చేరుకుని అనంతరం అక్కడ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్‌డిఒ రంగస్వామి అధికారులు, విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ఓటు వజ్రాయుధం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల మన డెమోక్రసీ ఇంత గట్టిగా నిలబడడానికి కారణం మన రాజ్యాంగమన్నారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనతోపాటు 125 దేశాలకు స్వాతంత్రం ఇచ్చారన్నారు. చాలా దేశాలలో సివిల్ రైట్స్ లేవన్నారు. దేశపౌరునికి దేశం ఇచ్చిన గొప్ప బహుమతి ఓటు హక్కు అని తెలిపారు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకొనే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల ఓటు వివేకంతో, విజ్ఞతతో వేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. మనల్ని పాలించే అవకాశాన్ని మంచి వారికి, సమర్ధులకు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. భవిష్యత్తులో 30 ఏళ్లు మన దేశాన్ని ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచన ప్రతి ఒక్క యువతీ, యువకుల్లో ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే కీలకమని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరూ ఓటు హక్కును పొందితీరాలని, దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఆర్‌డిఒ రంగస్వామి మాట్లాడుతూ కుల, మత, వర్గ విచక్షణ లేకుండా ప్రతీ ఒక్కరికీ మన రాజ్యాంగం ఓటుహక్కు కల్పించిందన్నారు. ఓటుహక్కు పొందడం, దానిని సక్రమంగా వినియోగించుకోవడం పౌరుని బాధ్యత అని తెలిపారు. నూతన ఓటర్లకు కలెక్టర్ ఎపిక్ కార్డులను అందజేశారు. అనంతరం సీనియర్ సిటిజన్లు సుబ్బమ్మ, రెడ్డమ్మ, ఆదిలక్ష్మి, శ్రీహరిబాబు, ఆదినారాయణలను కలెక్టర్ ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, తహశీల్దార్ రవిశంకర్ రెడ్డి, పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, మున్సిపల్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










