మడకశిర : సభలు, సమావేశాలను నిషేధిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసిన జీవో బ్రిటిష్ పాలనను తలపిస్తుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలు సమావేశాలు నిర్వహించడానికి పోలీస్ యాక్ట్ అమలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో బ్రిటిష్ పాలకులు కూడా ఈ విధంగా చేయలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు చేపట్టిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సంబందించిన సభలకు వస్తున్న జన వాహిని చూసిన సిఎంకు వెన్నులో వణుకు పుట్టి ఇలాంటి జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి, నారా చంద్రబాబు సభలను కట్టడి చేయడానికి ముందస్తుగా ఇలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారని విమర్శించారు. .ప్రతిపక్ష పార్టీ నాయకుల సభలు జరిగే చోట పోలీసు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .










