ప్రజాసమస్యల పరిష్కారంలో వైసిపి విఫలం
ప్రజాశక్తి-కలిగిరి : సంక్షేమ పథకాల పేరిట తాత్కాలికంగా బటన్ నొక్కుడు ప్రక్రియ తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను వైసిపి విస్మరించిందని ఉదయగిరి మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు విమర్శలు చేశారు. శనివారం ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ముందుగా బొల్లినేని వెంకట రామారావు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌళిక వసతులను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్బడుతున్నదని వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాలలో ఒక్కరోడ్డు కూడా వేయలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మారుమూల సైతం ఉన్న ప్రతి గ్రామాలలో సిమెంటు రోడ్లు వేశామని గతంలో వేసిన సిసి రోడ్లును బొల్లినేని రామారావు స్వయంగా ప్రజలకు చూపించారు. విలువైన స్థలాలు కబ్జాలు, ఇసుక దోపిడీలు, చారిత్రక కట్టడాల కూల్చివేతలు తప్ప వైసిపి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఉద్దరించిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా గత టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై ముద్రించిన కరపత్రాల రూపేణా ప్రజలకు అందజేస్తూ వాటిలో పేర్కొనబడిన అంశాలను సమగ్రంగా చదువుతూ వివరించారు. అంతేగాక ప్రజల వద్ద నుండి వివిధ సమస్యల గురించి సమాచార వినతులు స్వీకరించే దిశగా ఏర్పాటు చేసిన రచ్చబండకు విశేషమైన స్పందన లభించడంపై వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర అభివృద్ధిలో విశేష అనుభవం గడించి ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే ప్రజారంజకమైన పరిపాలన సాధ్యమని బొల్లినేని రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, రాంబాబు, స్వర్ణ కొండయ్య, చంద్రమౌళి, తదితర టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.










