ప్రజాశక్తి-విజయవాడ: సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సెంటర్‌లో దసరా సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యూత్ కళాకారులు వేసిన వెస్ట్రన్ డ్యాన్స్, జానపద, శాస్త్రీయ నృత్యాలు యువత, ఇతర ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. యూత్ వేసిన స్టెప్‌లు అదిరాయి. 200 మంది కళాకారులు పాల్గొని వివిధ కళారూపాలను ప్రదర్శించారు. వందలాది మంది ప్రేక్షకులు వీక్షించారు. మంగళవారం సాయంత్రం 5.45 నుంచి రాత్రి 9 గంటలకు పైగా ప్రదర్శించిన కళా రూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిషాసుర మర్ధని నృత్యం, జానపద నృత్యాలు, వెంకిపాటలు, రకరకాల సినిమా పాటలు, శాస్త్రీయ నృత్యాలు ఎంతో లయబద్దంగా చిన్నారుల ఎంతో అనుభవపూర్వకంగా అన్నట్లు ప్రదర్శించారు. సినిమా పాటలకు వేసిన డాన్స్‌లు ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలు కొట్టారు. మధ్యలో చిన్నపాటి వర్షం కురిసి కొద్ది సేపు అంతరాయం ఏర్పడినా మొత్తంగా ఆద్యంతం ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో దసరా సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంబరాల నిర్వహణ కమిటీ బాద్యులు డివి రాజు, వెలగా శ్రీను, ఎస్‌కె ఆషా, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










