- ప్రైవేటు మిల్లుకు రేషన్ కందిపప్పు
- రీ సైక్లింగ్ చేసి మార్కెట్‌లో విక్రయం
- ప్రజాశక్తి నిఘాతో గుట్టురట్టు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టింది. పేదల కోసం సిద్ధం చేసిన రేషన్ కందిపప్పు అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. తెల్లరేషన్ కార్డుదారులకు అందించాల్సిన అధికార యంత్రాంగం ప్రైవేటు మిల్లుల్లో రీసైక్లింగ్ చేయించి అప్పనంగా అమ్ముకునేందుకు తెరలేపింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దరి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో అయ్యప్ప దాల్ మిల్లుకు రోజూ లారీలతో కందిపప్పు వస్తోంది. రేషన్ ద్వారా కిలో రూ.67కు పంపిణీ చేయాల్సిన కందిపప్పును రీసైక్లింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి గ్రేడ్-1 క్వాలిటీ కింద కిలో రూ.110 చొప్పున విక్రయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాశక్తి నిఘా వేసింది. గురువారం మిల్లును సందర్శించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఇది మినుములు ప్రాసెసింగ్ చేసే మిల్లు. మిల్లంతా తెల్లటి గోనె సంచులతో నిండి ఉంది. అన్ని సంచుల్లోనూ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాల్సిన కందిపప్పు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అనే పేరుతో ముద్ర కూడా ఉంది. ఈ ప్యాకెట్లను అక్కడున్న సిబ్బంది చించేసి పప్పును మిల్లులో పాలిష్ చేస్తున్నారు.
ఇలా ప్రాసెస్ చేసిన పప్పును సంచుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. దీనిపై మిల్లు నిర్వాహకులను ప్రజాశక్తి వివరణ కోరగా మిల్లుకి దగ్గరలో కందిపప్పును తరలిస్తున్న లారీ ఆగిపోయిందని, దీంతో లారీలోని సరుకును ఇక్కడ నిల్వ చేశామని బదులిచ్చారు. ఇందులో వాస్తవం లేదన్నది అధికారుల మాటల్లో తేటతెల్లమౌతోంది. ఇటీవల కాలంలో వివిధ జిల్లాల్లో బియ్యంతోపాటు కందిపప్పు ఇవ్వడం లేదు. ఇదేమంటే ఇంకా స్టాక్ రాలేదని, రేపో ఎల్లుండో వచ్చి తీసుకోండని మొబైల్ రేషన్ నిర్వాహకులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో 6,90,180 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. కార్డు ఒక్కింటికీ కిలో చొప్పున సుమారు 690 టన్నుల కందిపప్పు నెలనెలా ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నెల 500 టన్నులు మాత్రమే పంపిణీ జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మిగిలించిన వేలాది టన్నుల కందిపప్పును ఇలా మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కందిపప్పును నేరుగా తరలిస్తున్నట్లు సమాచారం. కేవలం నెలివాడ మిల్లే కాకుండా మరికొన్ని మిల్లుల్లో కందిపప్పు అక్రమంగా నిల్వ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ స్టాక్‌పాయింట్ లేదు

బొండపల్లి మండలం నెల్లివాడ డాల్‌మిల్లులో మేము ఎలాంటి సరుకూ నిల్వ చేయలేదు. సరుకుల పంపిణీ, మిగులు సరుకులు తదితర అంశాలపై పక్కా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ నెలలో ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేశాం. మిగిలిన స్టాక్ మా ఆధీనంలోనే ఉంది.
కంది పప్పు మిల్లులు లేవు

కందిపప్పు తయారీ మిల్లులు జిల్లాలోనే లేవు. అక్కడక్కడ మినుము, పెసర పప్పు తయారీ మిల్లులు ఉన్నాయి. నెలివాడ అయ్యప్ప దాల్ మిల్లులో కేవలం మినపగుళ్లు మాత్రమే తయారవుతాయి. కంది పప్పు నిల్వులు ఉన్నట్టు మా దృష్టిలో లేదు. ఆ యజమాని కందిపప్పు నిల్వలు చేస్తే అది చట్టరీత్యా నేరం. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం.










