సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరి మంగళవారం నాలుగో రోజు సాగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగం బిజెపి పరిపాలనలో ప్రమాణంలో పడిందని తెలిపారు. అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండవలసిన దేశ ప్రజల మధ్య బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూటమి మత విద్వేషాలను చిచ్చు రాజేస్తుందన్నారు. అంబాని, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, గ్యాస్ కరెంట్ బిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ప్రజల బ్రతికే కష్టమైందన్నారు. గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీని సైతం అటకెక్కించిందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభాలు ప్రజలపై భారాలు వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు బిజెపి విధానాలను వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి రామానుజులు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు విశ్వనాథ నాయక్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు, డిసిహెచ్‌ఎస్ జిల్లా కార్యదర్శి సుధీర్, రైతు సంఘం జిల్లా నాయకులు రంగారెడ్డి, మహిళా సమాఖ్య సుమిత్ర, అగిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, ఎఐటియుసి వెంకటేష్ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ :ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిముల వ్యతిరేకి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవరా అన్నారు. ప్రచార భేరి కార్యక్రమాన్ని తాళ్లపాక గ్రామ పంచాయతీలోని ఎల్లాగడ్డలో నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి పాలనలో ముస్లింలపైన దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలను ఒంటి కన్నుతో చూస్తోందని, నిత్యము వారిపై ఏదో ఒక ప్రాంతంలో దాడులకు పాల్పడుతూ వివక్షకు గురిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు షేక్ హుస్సేన్, బాదుల్లా, చాన్ బాష పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: ఎన్టీఆర్ సర్కిల్ నుండి ప్రభుత్వాసుపత్రి వరకు కరపత్రాలు పంచుతూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశంలో ఆర్థిక అరాచకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మతం పేరుతో రాజకీయాలు నడుపుతూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె.మురళి, నాయకులు తిరుమల, నాగమ్మ పాల్గొన్నారు. ఓబులవారిపల్లి : మండల పరిధిలోని బాల్‌రెడ్డిపల్లె పంచాయతీ నుండి ఇంద్రానగర్, తిరుగుడుపల్లి, ఎర్రగుంటకోట, అద్దుపల్లి ఎస్టఇ కాలనీ, చలంపాలెం, కొర్లకుంట గేటు వరకు సిపిఎం, సిపిఐ నాయకుల అధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.హెచ్.చంద్రశేఖర్, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి బిజెపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని తెలిపారు. బిజెపి కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని చెప్పారు. డిహెచ్‌పిఎస్ జిల్లా నాయకులు దార్ల నాగేశ్వరరావు, సిపిఎం మండల నాయకులు జయరామయ్య. సిపిఐ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, నాయకులు శివయ్య, హరి, చంగయ్య, కెవిపిఎస్ మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, సిఐటియు నాయకులు కేశవులు పాల్గొన్నారు










