ప్రజాశక్తి-పీలేరు: సచివాలయానికి వచ్చే వివిధ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ గిరీష సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని బోడుమల్లువారిపల్లె, వేపులబైలు గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలతో సచివాలయానికి వస్తుంటారని, వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు జాప్యం లేకుండా అందించాలని అప్పుడే లబ్దిదారులకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన వేపులబైలు గ్రామస్తులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. వేపులబైలు గ్రామానికి సంబంధించి 366 మంది భూములు కోల్పోయిన రైతులున్నారన్నారు. నష్టపరిహారం పంపిణీలో ఎటువంటి సమస్యలున్నా ఉన్నతాధికారులకు తెలియజేసి పరిహారం అందించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వీఆర్వోకు హెచ్చరించారు. సచివాలయం పరిధిలో ఎంత మంది గర్భవతులున్నారు, ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. రక్తహీనతతో బాధపడే వారందరికీ ఐరన్ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందేటట్లు చూడాలని ఎఎన్‌ఎంకు సూచించారు. ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లుండాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న జగనన్న గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇళ్ల నిర్మాణాలలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ ఇకెవైసి త్వరితగతిన పూర్తి చేయించాలని ఎంపిడిఒను ఆదేశించారు. ఇకెవైసి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మ్యుటేషన్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, గడువు దాటి ఏ ఒక్కఅర్జీ కూడా ఉండకూడదన్నారు. మ్యుటేషన్ అర్జీలను రిజెక్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్స్ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని ఎంపిడిఒకు సూచించారు. అనంతరం సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల కేలెండర్, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హుల, అనర్హుల జాబితా, ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిపి సతీష్ కుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు జయలక్ష్మీదేవి, చెంగల్రాయుడు, ఎంపిటిసి మధుసూదన్ రెడ్డి, తహశీల్దార్ రవి, ఎంపిడిఒ మురళీమోహన్‌రెడ్డి, వివిధశాఖల అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది ప్రలు, రైతులు పాల్గొన్నారు.










