ప్రజా వైద్యులు డాక్టర్ కొంగర దేవదాస్ - దేవదాస్ సంస్మరణ సభలో పలువురి నివాళి
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ప్రజా వైద్యులకుగా డాక్టర్ కొంగర దేవదాస్ ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, పేద ప్రజలకు వైద్య సేవలను అందించడంతో పాటు ఆరోగ్య రంగంపై అనేక అవగాహనా సదస్సులు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా ఉన్నారని పలువురు వక్తలు అన్నారు. ప్రజా వైద్యులు డాక్టర్ కొంగర దేవదాస్ సంస్మరణ సభ ఆదివారం నగరంలోని ఎ ప్లస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు వైద్యులు, వైద్య ప్రముఖులు, పలువురు ప్రముఖులు హాజరై కొంగర దేవదాస్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు కొంగర దేవదాస్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేవదాస్ ప్రజా వైద్యులుగా ఎంతో పేరు గడించారని అన్నారు. హుజూర్ నగర్‌లో ప్రజా వైద్య శాలను స్థాపించి పేద ప్రజలకు ఆయన ఉచిత వైద్య సేవలను అందించారన్నారు. అటువంటి గొప్ప వైద్యులు నేడు మన మద్య లేకపోవడం బాధాకరమని అన్నారు. మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి, ఆంధ్రా హాస్పటల్స్ అధినేత డాక్టర్ ఫి.వి. రమణమూర్తి, ఎబిసి ఇమేజింగ్ అధినేత డాక్టర్ రాజేశ్వరరావు, పలువురు వైద్యులు పాల్గొని నివాళులు అర్పించారు.










