జమ్మలమడుగు రూరల్/పెద్దముడియం : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమాన్ని మరిచిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. గురువారం వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలంలోని ఎన్.కొత్తపల్లె విడిది కేంద్రం నుంచి పెద్దపసుపుల జంక్షన్, పెద్దపసుపుల, పెద్దపసుపుల చావిడి, జమ్మలమడుగు బైపాస్ విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగుగింది. ఆయా ప్రాంతాల్లో ముస్లిములు, గ్రామస్తులు, క్రిష్టియన్లు, రైతులతో మాటామంతి, ముఖాముఖి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్ మాట్లాడుతూ గ్రామాలకు నిధులివ్వకపోగా, గ్రామ పంచాయితీల్లోని రూ.8,660 కోట్లను సర్పంచ్‌లకు తెలియకుండా దొంగిలించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 25 వేల కి.మీ సిసి రోడ్లు, 30 లక్షల ఎల్‌ఇడి లైట్లు వేశామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కుందూనది ముంపు సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. రాజోలి ప్రాజెక్టును 2.95 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించి, నిర్వాసితులందరికీ పరిహారం ఇస్తామని తెలిపారు. జగన్ పాలనలో పేదలు, దళితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు. జగన్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యరంగం కుప్పకూలిందన్నారు. కర్నూలు, అనంతపురం వంటి పెద్దాసుపత్రుల్లో సైతం కనీసం దూది, గాజుగుడ్డలేని దుస్థితి నెలకొందన్నారు. గ్రామ పంచాయితీల నిధులను ప్రభుత్వం దొంగిలించడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా వారి వద్ద నిధుల్లేవన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. జగన్మోహన్‌రెడ్డి దివాలా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు, నాలుగేళ్లుగా గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కొన్నిచోట్ల పరువుకోసం సొంత డబ్బుతో పనులు చేసిన సర్పంచ్‌లు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసిపి నేతలు యథేచ్చగా అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. నర్సరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారని తెలిపారు. పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హాన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో పూర్తిగా నీరుగార్చారన్నారు. దుల్హాన్ పథకం కింద టిడిపి హయాంలో 32,722 మందికి 163.61 కోట్లు అందజేస్తే, వైసిపి ప్రభుత్వం ఊరికి ఒకరిద్దరికి కూడా పథకాన్ని ఇవ్వలేదని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకంలో వైసిపి పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం, అర్హులందరికీ పథకం అమలు చేసి, గతంలో మైనారిటీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి మైనారిటీల స్వావలంబనకు కషిచేస్తాం. జమ్మలమడుగు మైనారిటీలకు కమ్యూనిటీ హాలు, ఉర్దూ పాఠశాల, ప్రత్యేక శ్మశానవాటిక నిర్మిస్తామన్నారు. అర్హత ఉన్న బీడీ కార్మికులందరికీ ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, టిడిపి నాయకులు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జి.ఖదీర్, సయ్యద్, రఫీ, నజీర్, జి.కె.గైబు, బిసి నాయకులు ఎ.కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి జె.రమణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.
నాలుగు రోజులు యువగళంకు విరామం
గురువారం మధ్యాహ్నం యువగళం యాత్ర పెద్దపసుపుల రోడ్డులోని జమ్మలమడుగు బైపాస్ వద్ద 110వ రోజు ముగిసింది. 26, 27, 28, 29వ తేదీల్లో నాలుగు రోజులు యాత్రకు విరామం ప్రకటించారు. మహానాడు కార్యక్రమం వలన ఈ యాత్ర ఆగినట్లు యువగళం మీడియా కో-ఆర్డినేటర్ తెలిపారు. ఇప్పటికీ మొత్తం యాత్ర 1423.7 కి.మీ సాగింది. 110వ రోజు 12.3 కిలోమీటర్లు సాగింది. ఈ నెల 30వ తేదీన తిరిగి యువగళం యాత్ర పునఃప్రారంభమవుతుంది. అదే రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి తెలిపారు.










