ప్రజా రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలి : 'ప్రజాశక్తి'తో తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్
- అందరి భాగస్వామ్యంతోనే ప్రజా ప్రణాళిక అమలు
- పార్టీ, ప్రభుత్వం ప్రోత్సాహం ఎంతో ఉంది
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో ప్రజా రాజకీయాల బలోపేతానికి యువతే కీలకమని తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ అన్నారు. రాజకీయాల్లోకి యువత రావల్సిన అవసరం ఉందని అన్నారు. బూర్జువా పార్టీల్లో వారసత్వంతో యువత వస్తున్నారని, దీనివల్ల ఫలితం ఏమీ లేదని పేర్కొన్నారు. 23వ సిపిఎం అఖిల భారత మహాసభకు హాజరైన తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ ప్రజాశక్తితో మాట్లాడారు. ఆ సంభాషణ ఇలా సాగింది :
- మీరు మేయర్ అయిన తరువాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు?
నేను మేయర్ అయ్యే నాటికి కరోనా పెద్ద సవాల్‌గా నిలిచింది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాం. ప్రజల భాగస్వామ్యంతో కరోనాను ఎదుర్కొన్నాం. నేను మేయర్ అవ్వకముందే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ఒక విధానం రూపొందించింది. అది అప్పటికే అమలవుతోంది. దాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలందరికీ విద్య, వైద్యం అందించడం మా లక్ష్యం. ఆ రెండు రంగాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగని ఇతర రంగాలను విస్మరించటం లేదు. తిరువనంతపురాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- దేశంలోనే అతి పిన్న వయసు మేయర్‌గా ఎలా ఫీలవుతున్నారు?
దేశంలో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో తిరువనంతపురం ఒకటి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వంద వార్డులు ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక కార్పొరేషన్‌కు మేయర్‌ని కావడం సంతోషంగా ఉంది. ప్రజలు నన్ను సంతోషంగానే స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
- ఎన్నికల్లో పోటీ చేయడానికి, మేయర్ అవ్వడానికి పార్టీ ఎలా సహకరించింది?
నాకే కాదు, యువతకు పార్టీ పెద్దపీట వేస్తోంది. అన్ని విధాలా ముందుండి నడిపిస్తోంది. పార్టీ సీనియర్ల అనుభవాలతో పని చేస్తున్నా. నన్ను మేయర్‌గా ప్రకటించినప్పుడు కొంత మంది ప్రతిపక్ష నాయకులు చిన్న పిల్లకు తిరువనంతపురాన్ని అప్పగిస్తున్నారని విమర్శలు చేశారు. దానికి పార్టీ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆమె సామర్ధ్యం ఏంటో పనితో సమాధానం ఇస్తుందని స్పష్టం చేసింది.
- మరి మీరెలా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు?
పని చేయడానికి వయసు అనేది సమస్య కాదు. అనేక మంది నేతలు చిన్న వయసు నుంచే పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే అనేక మంది ఇంతకంటే పెద్ద బాధ్యలు నిర్వర్తించారు. పని చేయాలనే తపనకు వయసు అడ్డురాదు.
- మీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు ఎలా వస్తున్నాయి?
మా మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సరిపడిన నిధులు కేటాయింపు ఉంది. మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా సొంతంగా నిధులు సమకూర్చుకుంటుంది. మా బడ్జెట్ కూడా మిగులు బడ్జెట్టే.
- మీ కంటే సీనియర్లు ఉన్న కార్పొరేషన్‌ను ఎలా లీడ్ చేస్తున్నారు?
అవును... మా కౌన్సిల్లో అందరూ నాకన్నా సీనియర్లే. వంద మంది కార్పొరేటర్లలో వయసురీత్యా నేను చిన్నదానిని. అనుభవం, అవగాహన ఉన్న సీనియర్ల సలహాలు, సూచనలతో పాలన సాగుతోంది. చర్చల్లో అందరి భాగస్వామ్యం ఉంటుంది. కొన్నిసార్లు బిజెపి, కాంగ్రెస్ సభ్యులు సీనియర్లుగా ఉన్నప్పటికీ సలహాలు, సూచలను ఇవ్వకుండా రాద్ధాంతం చేస్తున్నారు. ఆ సవాల్‌ను కూడా మేము పనిద్వారా ఎదుర్కొంటున్నాం.
- ప్రజా ప్రణాళికను ఎలా బలోపేతం చేస్తున్నారు?
కేరళ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రణాళిక రూపొందించింది. దాన్ని మా కార్పొరేషన్‌లో కూడా అమలు చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే మా అభివృద్ధి ప్రణాళిక సాగుతుంది. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించడంలో మా కార్పొరేషన్ గొప్ప పాత్ర పోషించింది.
- మీపై కాంగ్రెస్, బిజెపి నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరేమంటారు?
నేను మేయర్ అయిన కొన్ని రోజులకే కాంగ్రెస్ ఎంపి నాపై స్త్రీద్వేష వ్యాఖ్యలు చేశారు. ఇంకొంత మంది ప్రతిపక్ష నాయకులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఆ పార్టీల నేతలకున్న ద్వేషాన్ని అవి స్పష్టం చేశాయి. వాటికి నేను పెద్దగా స్పందించలేదు. వారి ఆలోచనా విధానాన్ని, సంకుచిత స్వభావాన్ని ప్రజలు గ్రహించారు. వారే సమాధానం ఇచ్చారు.
- మహిళా సమస్యలపై ఏం చెప్పదలుచుకున్నారు?
దేశంలోని మహిళలు ఇంటా బయటా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనా ధోరణి మహిళలను మరింత సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక సమస్యలతో మహిళలు దాడికి గురవుతున్నారు. నేను బాలల సంఘం, ఎస్‌ఎఫ్‌ఐలో పని చేసేటప్పుడు నుంచి మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నాను. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సి ఉంది.










