ప్రజాశక్తి-హిందూపురం : అటవీసంపద పరిశ్రమల్లో మండుతోంది. ఈ విషయంపై సంబందిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. తూమకుంట పారిశ్రామిక వాడలోని రాహుల్ బేరియం రసాయనక పరిశ్రమలో బాయిలర్ల వద్ద నిల్వ ఉన్న అటవీ సంపదే అందుకు నిదర్శం.
హిందూపురం రూరల్ మండలం తూమకుంట, గోళాపురం పారిశ్రామిక వాడలు ఉమ్మడి జిల్లాలోనే పెద్దవి. ఇక్కడ దాదాపు 130కు పైగా వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలతో పాటు తక్కువ మందికి ఉపాధి నిస్తూ ఎక్కువ కాలుష్యం చేసే పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్టీల్, రసాయనక పరిశ్రమల వల్ల భూమి, వాతవరణం కాలుష్యం అవుతోంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో వెలసిన గార్మెంట్స్ పరిశ్రమల వల్ల భూమి కాలుష్యం అవుతోంది.కాలుష్య చట్టాలతో పాటు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి అటవి సంపదను తెగ నరికి పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. అయినప్పటికి అటు రెవిన్యూ, ఇటు అటవీ శాఖ అధికారులు అటు పక్క కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఈ పరిశ్రమలు చిమ్మే విషవాయువును నుంచి కాస్తా ఉపసమనం లభించాలంటే విరివిగా చెట్లను పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో చెట్లను పెంచుతోంది. ఆ చెట్లను కొంత మంది స్వార్థ పరులు నరకి, పరిశ్రమల వారికి అమ్ముతున్నారు. వాస్తవానికి పరిశ్రమల్లో అటవీసంపదను వినియోగించడానికి లేదు. బాయిలర్ ఉంటే దానికి గనుల నుంచి లభించే బొగ్గును, గ్యాస్‌ను వాడాల్సుంటుంది. అయితే వాటిని వినియోగిస్తే అధిక ఆర్థిక భారం అవుతుందని అటవీ సంపదను వినియోగిస్తున్నారు. దీనిపై రెవిన్యూ, అటవి శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, అటవీ సంపదను వినియోగించే పరిశ్రమలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడ చుట్టుపక్కల ఉన్న రైతులు కోరుతున్నారు.










