ప్రజాశక్తి-రాయచోటి : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ గిరీష అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 12వ జిల్లా పరిశ్రమల ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు అధికారులు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతన పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులకు సంబంధించి ఇప్పటి వరకు 1482 దరఖాస్తులు వచ్చాయన్నారు. 1428 ధరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. గడువులోపల పరిష్కరించాల్సిన అర్జీలు 7 ఉన్నాయని వీటిని వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఇండిస్టియల్ డెవలప్మెంట్ పాలసీ - 2020 -23, రెండు పరిశ్రమలకు23,15,345 మరియు వైయస్సార్ జగనన్న బడుగు వికాసం కింద 9 యూనిట్లకు (వాహనాలు) పెట్టుబడి రాయితీకి సంబంధించి రూ.72,58,330 మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ రాయితీ కింద ఒక పరిశ్రమకు రూ.1,95,865 మంజూరు చేయడమైనదన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం 2023-24 కింద జిల్లాలో ఇప్పటివరకు 34 యూనిట్‌లకు గాను రూ.71.64 లక్షలు బ్యాంకులు రుణ మంజూరు చేశాయన్నారు. ఇంకా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వివిధ బ్యాంకుల ద్వారా రుణ మంజూరు చేయించవలసిందిగా లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సులభతర వాణిజ్య విధానం కింద సింగల్ డెస్క్ పోర్టల్ నందు జనవరి 1,2022 నుండి అక్టోబర్31, 2022 వరకు వివిధ శాఖల నుండి పొందిన సేవల మీద దరఖాస్తుదారులను సర్వే చేయడం జరుగుచున్నందున వివిధ శాఖల అధికారులు ఫీడ్బ్యాక్ సర్వే చేయవలసిందిగా ఆదేశించారు. ఈ ఏడాది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నందు మన రాష్ట్రము మొదటి ర్యాంకును పొందేందుకు అన్నమయ్య జిల్లా పూర్తి తోడ్పాటు అందించాలని వివిధ శాఖల నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎపిఐఐసి ఆటోనగర్ పీలేరులో ఫ్లాట్ అలాట్మెంట్ పొందిన 15 యూనిట్లకు ల్యాండ్ రిబేట్ కొరకు అర్హత పత్రాలు ఇవ్వడం కొరకు ఆమోదం తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జె.నాగరాజ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నెలకు ఒకటి చొప్పున 12 ఇండిస్టీస్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ప్రతినెలా ఈ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా రవాణ శాఖ అధికారి శాంతకుమారి, ఎపిఎస్‌పిడిసిఎల్ ఇఇ చంద్రశేఖర్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నారాయణరెడ్డి, ఎపిఎస్‌ఎఫ్‌సి అధికారి నాగభూషణం, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి శివప్రసాద్, జిల్లా కార్మిక శాఖ అధికారి డి.రంగరాజు, డిఐఎ కన్వీనర్ రాజశేఖర్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.










