ప్రజాశక్తి - రాయచోటిహొ: జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు అధికారులు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ గిరీష పిఎస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 9వ జిల్లా పరిశ్రమల ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివద్ది చెందుతుందని, జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .రైల్వే కోడూరు ప్రాంతంలో దాదాపు 6వేల హెకార్లలో అరటిపంట సాగు చేశారని చెప్పారు. ఇక్కడ అరటి పంట ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమలు స్థాపించాలని అధికారులకు తెలిపారు. నూతన పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులకు సంబంధించి ఇప్పటి వరకు1417 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 1363 ధరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. గడువులోపల పరిష్కరించాల్సిన అర్జీలు ఏడు ఉన్నాయని వీటిని వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఇండిస్టియల్ డెవలప్మెంట్ పాలసీ - 2020 -23 వైఎస్‌ఆర్ జగనన్న బడుగు వికాసం కింద 12 యూనిట్లకు (వాహనాలు) పెట్టుబడి రాయితీకి సంబంధించి రూ. 1,48,73,212 మంజూరు చేశామని చెప్పారు. విద్యుత్ రాయితీ కింద 4 పరిశ్రమలకు రూ. 9,70,593, పరిశ్రమలకు వడ్డీ రాయితీ కింద రూ. 4,65,726 మంజూరు చేయడమైనదన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 65 యూనిట్లకుగాను రూ.4.61 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేశామని చెప్పారు. బ్యాంకులలో పెండింగ్ లో ఉన్న 313 దరఖాస్తులను వివిధ బ్యాంకుల ద్వారా రుణ మంజూరు చేయాలని లీడ్ బ్యాంకు మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంఎస్‌ఎంఇ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రెండు క్లస్టర్ల అభివద్ధిని సమీక్షించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రుణ విడుదలకు ఇడిపి ట్రైనింగ్ సర్టిఫికెట్లు తప్పనిసరి కావడం వల్ల దానికి సంబంధించిన ఒక శిక్షణ కేంద్రానికి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజ మాట్లాడుతూ. ఎపిఐఐసి ఇండిస్టియల్ పార్క్ పీలేరులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చిన 3 దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు నెలకు ఒకటి చొప్పున 9 ఇండిస్టీస్ అండ్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రతినెలా సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జె.నాగరాజ, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, డిఐఎ కన్వీనర్ రాజశేఖర్, లక్కిరెడ్డిపల్లె ఉద్యానవన శాఖ అధికారి నాగమణి, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.










