Mar 25,2023 21:48

సమావేశంలో మాట్లాడుతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటి రెడ్డి

            ప్రజాశక్తి-హిందూపురం   నిరుద్యోగ యువతీ, యువకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపన కోసం ముందుకొస్తే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద నిరుద్యోగులకు రుణాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోటి రెడ్డి తెలిపారు. శనివారం హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో పురపాలక సంఘం వ్యాప్తంగా మెప్మా ఆర్‌పిలు, వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీలకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద పరిశ్రమల స్థాపనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మహిళలు వారి సంఘాల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. వారంతా మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ యువకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపన కోసం ముందుకొవచ్చే వారికి వివరించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే పెట్టుబడిలో 35 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో ప్రాజెక్టు గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు, సేవారంగంలో రూ.20 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇందులో లబ్ధిదారుల వాటా 5 నుండి 10 శాతం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ అధికారులు సురేష్‌బాబు, దేవేంద్రకుమార్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.