Jan 26,2022 09:50
  • బీమా, ఇన్‌పుట్‌... ఏది ?
  • కేంద్రానికి రెండు రకాల లేఖలు
  • భారం స్టేట్‌పై నెట్టే యోచనలో ఢిల్లీ
  • ఎటూ తేల్చని రాష్ట్రం
  • ఆందోళనలో మిర్చి రైతు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : అంతుబట్టని తెగుళ్ల కారణంగా ఖరీఫ్‌లో మిర్చి పంట నష్ట పోయిన రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. సహాయంపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నాయి. రైతులను ఏ రూపేణా ఆదుకోవాలనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ.. రెండు మార్గాల్లో ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. కాగా నిబంధనలు ప్రస్తుతం మిర్చికి జరిగిన నష్టానికి వర్తిస్తాయా లేదా అనే దానిపై అయోమయం నెలకొంది. రాష్ట్రంలో దిగుబడి ఆధారిత, వాతావరణ ఆధారిత బీమా పథకాలు అమల్లో ఉన్నాయి. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రం స్వంతంగా వీటిని అమలు చేస్తోంది. కేంద్రానికి చెందిన ఫసల్‌, తాజా పర్చిన వాతావరణ ఆధారిత స్కీంలకు నిర్దేశించిన మార్గదర్శకాలనే ప్రామాణికంగా తీసుకుంది. ఇ-క్రాప్‌లో సాగులు నమోదైతేనే రాష్ట్ర బీమా పథకాలు అమలవుతాయి. మిర్చి విషయంలో బీమా పథకాల నోటిఫికేషన్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. కేవలం విపత్తులు, వాతావరణ పరిస్థితులే వర్తిస్థాయి. అలాంటప్పుడు బీమా స్కీంలు తామర తెగులుకు వర్తించబోవన్న వాదన ఉంది. కేంద్రంతో నిమిత్తం లేకుండా రాష్ట్రం ఇన్సూరెన్స్‌లను అమలు చేస్తున్నందున పూర్తి భారం రాష్ట్రమే మోయాల్సి ఉంది. కానీ బీమాపై కేంద్రానికి రాశామని ఎపి ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర బీమా పథకాలే అమల్లో ఉన్నాయని, అక్కడ ఏం చేస్తే ఇక్కడా అదే కేంద్రం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తోంది.
 

                                                                  విపత్తు నిధులెలా ?

మిర్చి రైతులను ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. వర్షాలు, వరదలు, కరువు, వడగండ్ల వానలు, మంచు తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వర్తిస్తుంది. విపత్తు సహాయ నిధి నుండి చెల్లింపులు చేయాలి. కేంద్ర, రాష్ట్ర నిబంధనలు వర్తిస్తాయి. కనీసం 33 శాతం పంట నష్టపోతే సహాయం ఇస్తారు. మిర్చికి తామరపురుగు సోకడంతో దిగుబడి నష్టం వాటిల్లింది. కేంద్రం తామర పురుగును విపత్తుగా పరిగణించట్లేదు. అందువల్ల కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే ప్రత్యేకంగా తన నిధులతో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఇన్‌పుట్‌ సబ్సిడీపైనా కేంద్రానికి విజ్ఞాపన పంపామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రెండు రకాల విజ్ఞాపనలు ప్రస్తుతం కేంద్రం వద్ద మూలుగుతున్నాయి.
 

                                                               నష్టం 3 వేల రూ.కోట్లు

ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.60 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. ఐదు జిల్లాల్లో గణనీయంగా సాగైంది. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట తుడిచిపెట్టుకుపోగా, మరో లక్ష ఎకరాల్లో ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లు రావడం కనాకష్టమైంది. ఎకరానికి రైతులు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు మరో రూ.50 వేలు అదనం. పెట్టుబడి నష్టం తక్కువలో తక్కువ రూ.2-3 వేల కోట్లపైమాటే. పంటను నిలుపుకునేందుకు చాలా చోట్ల మందులు కొడుతుండటంతో ఖర్చు ఇంకా పెరుగుతోంది. కనీసం ఎకరాకు రూ.లక్ష పరిహారం అడుగుతున్నారు. అధికారులు తమ పొలాలు దర్శించి పరిహారం కోసం పేర్లు రాస్తారని చాలా చోట్ల రైతులు ఎదురు చూస్తున్నారు.

చుి