అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, కొత్తవారిపల్లి పంచాయతీ, పూలవాండ్లపల్లి సమీపం లోని అబ్బగొంది చెరువు దగ్గర ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. రూరల్ పోలీసుల కథనం మేరకు వివరాలు.... అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదురిపికొండకు చెందిన బోయ రమణ కుమార్తె బి.వినీషా (17), అదే ఊరికి చెందిన ధనంజయ కుమారుడు ముత్తులూరు వెంకటనాయుడు (28) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమిచుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో అమ్మాయి తండ్రి గతంలో కూడేరు పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9న ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. మొదట తిరుమలకు వెళ్లి పెళ్లి చేసుకుని తిరుగు ప్రయాణంలో చనిపోవాలనుకున్నారు. కానీ ముందుగానే అబ్బగొంది అడవికి వచ్చి ఓకే చున్నీతో మూడు రోజుల క్రితం ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. మతదేహాలను ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చీకటిగా ఉండటంతో సోమవారం ఉదయం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు










