Apr 05,2023 21:29

చెక్కు అందజేస్తున్న మంత్రి కాకాణి

చెక్కు అందజేస్తున్న మంత్రి కాకాణి
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలి
నెల్లూరు :మహిళలందరూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని సరికొత్త ఆలోచనలతో చిరు వ్యాపారాల్లో రాణించాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై ప్రత్యేక దష్టి సారించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కస్తూరిదేవి గార్డెన్స్‌ లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వై ఎస్‌ ఆర్‌ ఆసరా మూడో విడత రుణమాఫీ నిధులు పంపిణీ కార్యక్రమంలో ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మతో కలిసి మంత్రి కాకాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయం సహాయక మహిళలు వారు ఉపాధి పొందుతున్న పనిముట్లతో ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రజా ప్రతినిధులు పరిశీలించి, వాటి పనితీరు, పొందుతున్న లాభాలను అడిగి తెలుసుకున్నారు
. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహిళలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రతి పథకాన్ని కూడా మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని, ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారాల ద్వారా రాణించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని, పిండి మిల్లులు, పాప్‌ కాన్‌, చెరుకు రసం మిషన్లు, పొట్టేళ్ల పెంపకం, కుటీర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ వడ్డీకే సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తుందన్నారు. పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని, ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తే, వారు ఆర్థిక స్వావలంబన సాధించి సంతోషంగా జీవిస్తారనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్సార్‌ ఆసరా, చేయూత, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, ఈబీసీ నేస్తం వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మహిళలను సొంత అక్కాచెల్లెళ్ళుగా భావిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సభ్యులకు ఆసరా 3వ విడత నిధులను సీఎం విడుదల చేస్తున్నారన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా మహిళల ఖాతాల్లోనే ఈ నగదును జమ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 34,440 గ్రూపులకు 826 కోట్లు మంజూరు చేసామన్నారు. రూరల్‌ పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు సంబంధించి 2388 సంఘాల్లోని 21323 మంది మహిళలకు సుమారు రూ. 16.92 కోట్ల వారి ఖాతాలకు జమ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్న తరహా జీవనోపాధులు ఎంచుకుని ఆర్ధిక సుస్థిరత సాధించాలని మంత్రి మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం రూరల్‌ మండలానికి సంబంధించిన 2388 సంఘాల్లోని 21323 మంది సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా 3 వ విడత మొత్తం 16 కోట్ల 92 లక్షల 67 వేల రూపాయల చెక్కును మహిళలకు అందచేశారు.ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రవీంద్ర, ఆర్‌డిఒ మలోల, స్థానిక ప్రజా ప్రతినిధులు, మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల్లోని మహిళలు పాల్గొన్నారు.