ప్రజాశక్తి-వాల్మీకిపురం : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం కోవిడ్ మాక్ డ్రిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫైరోజా బేగం మాట్లాడుతూ బ్రెజిల్, ఇతర దేశాల్లో ప్రబులుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. కోవిడ్ బాధితుల కోసం ఆసుపత్రిలో పది పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఆక్సీజన్ బెడ్లు, ల్యాబ్, ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు తరచూ చేతులను శుబ్రం చేసుకుంటూ, మాస్కులు ధరించాలని ఆమె సూచించారు. కోవిడ్ మొదటి దశలో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని మసులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు సోని, సనా ఆయేషా, శ్రీలక్ష్మి, హర్షిత రెడ్డి, గురుస్వామి, సిబ్బంది సుధాకర్, భాస్కర పాల్గొన్నారు. పీలేరు: నాలుగో దశ కరోనా ఉధృతి విషయంలో ఆందోళన వద్దని, ప్రతి ఒక్కరూ నియంత్రణ విషయంలో అవగాహన పెంచుకోవదమే దానికి మందని తలుపుల పిహెచ్‌సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'కరోనా ఉధృతి-అవగాహనతో అడ్డుకట్ట' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంద వద్దని, పరిస్థితికి తగ్గట్టు అవగాహన అందరికి ముఖ్యమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, పర్యవేక్షకులు కుసుమ, కృష్ణయ్య పాల్గొన్నారు.










