ప్రజాశక్తి -పెనుకొండ : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ముందు వున్న పాఠశాల ఆవరణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్ల సేవలు గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోందని తెలిపారు. వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆశయ సాధనకు వాలంటర్లు చేస్తున్న సేవలు గొప్పవన్నారు. వీరు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం వాలంటీర్లను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, ఛైర్మన్ ఫరూక్, వైస్ చైర్మన్ సునీల్, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోనిఆయా గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన వారికి సేవ మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర, పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రకుమార్, హిందూపురం రూరల్ మండల జడ్‌పిటిసి నాగభూషణం, వైస్ ఎంపీపీ, రఘనాథ్ రెడ్డి, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని స్థానిక మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తున్నామన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాది అవార్డులతో సత్కరిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో వాలంటీర్లు ముందుండాలని వాలంటీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










