Feb 08,2023 18:43

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ : వ్యవసాయ కార్మికులు, పేదలకు వ్యతిరేకంగా ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జయరామయ్య, పందికాళ్ళ మణి తెలిపారు.బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో జాతీయ మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు కోల్‌కత్తా నగరంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతుల్ని వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేలా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుకు ఢిల్లీ నుండి గల్లీ దాకా సాగిన పోరాటాలలో సంఘం చురుకైన పాత్ర వహించిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నేడు దేశవ్యాప్తంగా 200 రోజులు పనిదినాలు కావాలని నేటి ధరలు కనుగొనగా రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు అసైన్మెంట్‌ కమిటీ ద్వారా భూ పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జశివయ్య, ఆనందయ్య, చెంగయ్య, పెంచలయ్య, ఎర్రయ్య పాల్గొన్నారు.