Jul 14,2021 20:16

న్యూఢిల్లీ : ఇబ్బందికర పరిస్థితులను అధిగమించడానికి సమిష్టి కృషి అవసరమైనపుడు అంటే కోవిడ్‌ మహమ్మారి వంటి సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ విధానాల్లో ఎంతవరకు కోర్టులు జోక్యం చేసుకోగలుగుతామో పరిశీలించనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. ''విదేశీ కంపెనీల నుండి వ్యాక్సిన్ల ఫార్ములా తెప్పించాలని కోర్టు, ప్రభుత్వాన్ని కోరగలదా లేదా వెంటిలేటర్లు ఎన్ని వుండాలో నిర్ణయించగలదా.... ఇవి సంక్షోభ సమయాలు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాల్సి వుంది. కోర్టు ఇవన్నీ ఎప్పుడు, ఎలా చేయగలదు? ప్రభుత్వం, నిపుణుల సలహా తీసుకుని ప్రయోజనం పొందుతుంది. ఈ విషయాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలు ఎంతవరకు జోక్యం చేసుకోవాలో విచారిస్తాం.... మనల్ని మనం ఎంతవరకు నియంత్రించగలుగుతాం.'' అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమిష్టిగా కృషి చేయాల్సిన పరిస్థితులు వున్నాయి. ప్రతి వ్యవస్థ లేదా సంస్థ పనిచేయడానికి కొన్ని నిబంధనలు, ప్రామాణికాలు వుండాలి అని జస్టిస్‌ మహేశ్వరి పేర్కొన్నారు. కరోనా సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పట్టణాలు, గ్రామాల్లో వైద్య వ్యవస్థను ''రామ్‌ భరోసా''గా అభివర్ణించిన మే 17నాటి అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై యుపి ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దానిపై సుప్రీం విచారిస్తోంది. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై మే 21న స్టే విధించింది. ప్రభుత్వం పాటించాలంటూ కొన్ని ఆదేశాలను, సూచనలను హైకోర్టు జారీ చేసింది. వాటిని అమలు చేయడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 12న సుప్రీం చేపట్టనుంది.