Jan 04,2023 21:38

ఎమ్మెల్యే చేతులు మీదుగా ట్యాబ్‌లు తీసుకున్న విద్యార్థులు

         నల్లచెరువు : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని ఎమ్మెల్యే డా||పివి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబులను ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ విద్యకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా అత్యాధునికమైన వసతులతో కూడిన పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్పొరేట్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా అన్ని సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలోనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రమణారెడ్డి, జెడ్పీటీసీ విశ్వనాథ్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి నారాయణస్వామి, సర్పంచి పంచరత్నమ్మ, సర్పంచులు యూసఫ్‌, హైటెక్‌ రమణ, రమణారెడ్డి, షమివుల్లా, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్లు దశరథరామయ్య నాయుడు, సింగల్‌ విండో అధ్యక్షులు జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచి రవి కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.