ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ ఆగ్రహం
ప్రజాశక్తి-ఉదయగిరి : వెనుకబడిన మెట్ట ప్రాంతంలో అత్యధిక వలసలకు ప్రభుత్వం, నాయకులు వైపల్యమైనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు మాజీ ఎంఎల్‌ఎ మస్తాన్ వలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఆల్ ఖైర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుద్దుకూరి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ విస్తరణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన పిసిసి రాష్ట్ర ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం నుంచి 80 శాతం వరకు బతుకుదెరువు కోసం వలసలు వెళ్తున్నారని ఈ ప్రాంతం ఇంతలా వెనుకబడిన దానికి కారణం నాయకుల వైఫల్యమని దుయ్యబట్టారు. సామాన్యుడు బ్యాంకు మెట్లు తొక్కగలిగి బ్యాంకులో రుణాలు తీసుకునే స్థాయికి ఎదగడం ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలేనని ఈ దేశం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీని కూడగట్టే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ఆశాభవం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో దుర్మార్గపు దగాకోరు పరిపాలన సాగుతుందని, కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయాలను దుర్మార్గాలను ప్రశ్నించేవారు ఎవ్వరు లేరని తెలిపారు. ఒక్క రాహుల్ గాంధీ తన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఎప్పుడో పెట్టి విత్ డ్రా చేసుకున్న కేసును తిరగడోడి అతనికి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించడం, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందే తప్ప మరొకటి కాదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రస్తుతం రూ.500లకే గ్యాస్ ఇస్తున్నారని మిగతా రాష్ట్రాలలో రూ.1100 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉందన్నారు. ప్రజలకు ప్రతి ఒక్కదానిపై అధిక పన్నులు విధించి మోయలేని భారాలను ప్రజలపై మోపుతూ నిలువునా దోపిడీ చేసి బినామీలకు కట్టబెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై దుయ్యబట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత రాజకీయ నాయకులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి బలపడిన వారేనని తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉదయగిరి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ పార్టీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో తాను ప్రాధేయపడుతున్నానన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నం లతారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ పరకాల రంగస్వామి, స్టేట్ జనరల్ యూత్ కోఆర్డినేటర్ గణేష్ బాబు, జిల్లా సేవాదళ్ ప్రెసిడెంట్ కొండా అనిల్‌కుమార్, షేక్ కరీం, మాజీ ఎంపిపి సత్తెనపల్లి బాలయ్య, మండల అధ్యక్షులు చంద్రమౌలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.










