రాయచోటి : ప్రభుత్వ ఉద్యోగులను కనీసం సామాన్యులుగా గుర్తించాలని ఎపిజెఎసి జిల్లా చైర్మన్ నరసింహకుమార్ పేర్కొన్నారు. బుధవారం తమ డిమాండ్లను సత్వరం పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం తమ సమస్యల పరిష్కారానికై చేసే ఉద్యమమే తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని గుర్తుచేశారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పలు ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నాడు చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకున్నామన్నారు. అనంతరం పలు కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో కలసి ప్రభుత్వ ఉద్యోగులక సమస్యల పరిష్కారానికి ఎపిజెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేటికీ ప్రణాళిక బద్ధమైన పరిష్కారం లభించలేదన్నారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగుల ప్రమోషన్లు, జిపిఎఫ్, పిఆర్‌సిలపై కానీ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం వారు కోల్పోయిన హక్కుల పై కానీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబందించిన లైన్ డిపార్ట్మెంట్ సమస్యలపై కానీ ఇలాంటి పలు సమస్యలపై ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం దగ్గర ఎటువంటి స్పందన లేకపోవడంతో గత నెలలో తొలి దశ ఉద్యమాన్ని ప్రారంభించాంన్ననారు. ప్రభుత్వం సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించక పోవడంతో నేడు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఉద్యోగులు జిపిఎఫ్ బిల్లులు సమర్పించి సంవత్సర కాలం గడుస్తున్న ఫలితం లేదని, 2021 నుండి నేటికీ డిఎలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులను కనీసం సామాన్య ప్రజలుగా గుర్తించి బట్టన్ నొక్కి సమయానికి ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఒక బట్టన్ నిక్కి వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మల్లికార్జున, జిల్లా ట్రెజరర్ పిఎన్‌బి రెడ్డి, రాష్ట్ర ఎపిటిటిడి నాయకులు గాదన వెంకట నరసయ్య, ఎపి రెవెన్యూ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జనార్దన్ రాజు, ఎపిఆర్‌ఎస్‌ఎ రాయచోటి డివిజన్ ప్రెసిడెంట్ రామాంజులు, సెక్రటరీ సురేష్, జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ సెక్రటరీ ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.










