ప్రజాశక్తి-కదిరి టౌన్ : జాతీయ, మున్సిపల్, పంచాయతీ రోడ్లపై బహిరంగ సమావేశాలు, నిరసనలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం నాడు కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్‌లో జీవో:1 ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల మాచర్ల, గుంటూరు సంఘటనలను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిరసనలు, ఆందోళనలపై ఉక్కుపాదం మోపేలా జీవో తీసుకురావడం అప్రజాస్వామికం అన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఈ హక్కును కాలరాసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీవోలు తీసుకురావడం దుర్మార్గం అన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంల్లో కూడా ఘటనలు జరుగుతున్నాయని, వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలాంటి చీకటి జీవోలతో ప్రభుత్వం తన మనుగడనే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్మోహన్, సిపిఐ జిల్ల్షా కార్యదర్శి వేమయ్య యాదవ్, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మోపురిశెట్టి చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి బండారు మనోహర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బాబ్జాన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇసాక్, ఎఐకెఎస్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్, రామ్మోహన్, నారాయణ, టిడిపి నాయకులు, తేపల్లె మనోహర్, రాజేంద్ర నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుడాలగుంది రమణ పాల్గొన్నారు.
పెనుకొండ : సభలు, సమావేశాలు,రోడ్ షోలను నియంత్రిస్తూ చీకటి జీవోను తెచ్చిన వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందని జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పార్థసారథి విమర్శించారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జి.ఓ నెం: 1 కాపీలతో నిరసన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అర్ధరాత్రి విడుదల చేసిన జీవో నెం: 1 తో ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి జీవోల వల్ల జగన్ రెడ్డి ప్రభుత్వం మరింతగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు రంగయ్య, జిల్లా టిడిపి అధికార ప్రతినిధులు రొద్దం నరసింహులు, రఘువీర చౌదరి, బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గిరిథర్ గౌడ్, మండల కన్వీనర్ సిద్దయ్య, పట్టణ అధ్యక్షులు రవిశంకర్, రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి హుజూర్, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు అండ్రూస్, జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గౌడ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జి,ఓ ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, అడదాకులపల్లి మాజీ సర్పంచి ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, కౌన్సిలర్ గీతా హనుమంతు, బాలాజీ నాయక్, హరి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 1నివెంటనే ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్‌లో సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన నాయకులు కలసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు సభలు సమావేశాలు, ర్యాలీని నిర్వహించకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అర్ధరాత్రి జీవోలు తెచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ విధానం చూస్తుంటే అత్యవసర పరిస్థితి తలపించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌస్ లాజాం, పై పల్లి గంగాధర్, సిపిఐ నాయకులు ఆంజనేయులు, ఎఐటియు జిల్లా కార్యదర్శి బయన్న, జయలక్ష్మి, అరుణ్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకులు సామకోటి ఆదినారాయణ, మహమ్మద్ రఫీ, జనసేన నాయకులు అబ్దుల్, తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : రాష్ట్రంలో బ్రిటిష్ పాలన సాగుతోందని టీడీపీ నాయకులు విమర్శించారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జగన్ పరిపాలన పిరికివంద చర్యలు భావిస్తున్నామన్నారు. ఇదంతా ప్రజలు గమనిసున్నారని రాబోయే రోజుల్లో తగిన బుద్ధిచెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్ చింతలపల్లి మహేశ్ చౌదరి చింతపులుసుపెదన్న, నాగూర్ హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్,రాంపురం శీన అంబటి సనత్ తదితరులు పాల్గొన్నారు










