Feb 20,2023 22:09

అధికారికి సమస్యను వివరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ :ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కె. కార్తీక్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో 6 సంవత్సరాల కిందట ఎన్టీఆర్‌ కాలనీలో ఇంటి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం గృహాలు నిర్మించిందన్నారు. ఈసందర్బంగా ఆకాలనీలో అంగన్వాడీ కేంద్రానికి స్థలం కేటాయించారన్నారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారన్నారు. అధికారులు స్పందించి ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. దీంతో స్పందించిన సబ్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో తహశీల్దార్‌ స్వర్ణలత, ఆర్‌ఐ, విఆర్‌ఒ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మీనారాయణ, నరసింహులు, ఆంజనేయులు, సిపిఎం నాయకులు తిప్పన్న, బాబావలి, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, రెడ్డప్ప రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
శుద్ధ జల కేంద్రాలను ప్రారంభించాలని వినతి : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలంలో శుద్ధ జల కేంద్రాలను ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి రాజగోపాల్‌ కోరారు. ఈ మేరకు నాయకులు సబ్‌ కలెక్టర్‌ కె. కార్తీక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సోమందేపల్లి మండల కేంద్రంలో దాదాపు 20 వేల జనాభా కలిగి ఉందన్నారు. అత్యధికంగా చేనేత కార్మికులు దినసరి కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. పాలకులు మారుతున్న గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కాలదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సోమందేపల్లి మండలంలో శుద్దజల కేంద్రాలను ఏర్పాటు చేయలదన్నారు. అధికారులు,పాలకులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ మండల కార్యదర్శి చాంద్‌బాషా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, చేనేత కార్మిక సంఘం నాయకులు గంగరాజు, శ్రీకాంత్‌, భవన నిర్మాణ కార్మికులు రవి తదితరులు పాల్గొన్నారు.