Oct 25,2023 21:45

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాశక్తి - క్యాంపస్‌ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాలైన పేదరిక నిర్మూలన ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పద్మావతి మహిళ అధ్యయన కేంద్రం రీడర్‌ కే. హైమావతి పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం అధ్యాపకురాలు డాక్టర్‌ పి.సునీత ఆధ్వర్యంలో బోర్డ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ త్రు ఎడ్యుకేషన్‌ సహకారంతో అవగాహనను పద్మావతి నగర్‌ లోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ కోసం ప్రత్యేకమైన పథకం, అమ్మఒడి, జగనన్న మహిళా చేయూత, స్టార్టప్‌, మహిళా సాధికారత పెంచేందుకు వివిధ రకాల పెట్టుబడులకు చేయూత అందించే పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చంద్రగిరి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌. తులసి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. బాలికల కోసం ప్రత్యేకమైన డ్రెస్‌ కోడ్‌ తో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు ఎన్నో విలువైన పోషక ఆహార పదార్థాలను అందిస్తోందన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళల కోసం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మంచి పోషకాహారం అందిస్తున్నారన్నారు. బిసిడిటిఈ, మహిళ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ప్రజా పౌరసరఫరాల కేంద్రం ద్వారా అనేక ఆహార పదార్థాలను అతి తక్కువ ధరలకు అందిస్తూ వారి జీవన సామర్థ్యం పెంచుతున్నాయన్నారు. విద్యార్థినులు, మహిళా సంఘాల లీడర్లు ప్రజలలో బిపిఎల్‌ లో నివసించే మహిళలకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పి. సునీత, అంగన్‌వాడీ కేంద్రం టీచర్లు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.