Dec 11,2020 07:29

      ముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా అన్నదాతలు పదహారు రోజుల నుండి దేశ రాజధానిలో ఆందోళన చేస్తుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా సరికొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన మహోత్సవంలో ప్రధాని మునిగి తేలడం ఆయన ప్రాధాన్యతలేమిటో స్పష్టం చేస్తోంది. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే చర్య ఇది. సెంట్రల్‌ విస్టా పేరిట భారీ పరిపాలనా భవన సముదాయాల నిర్మాణ అంశంపై వ్యాజ్యం సుప్రీం కోర్టు ముందుంది. ప్రభుత్వం కాగితాలపై పని (పేపర్‌ వర్క్‌) చేసుకోవచ్చు కాని ఎలాంటి నిర్మాణం చేపట్టరాదనీ, ఏ భవనాన్నీ కూలగొట్టడానికి గాని చెట్లను నరకడానికి గానీ వీలు లేదని ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది. అయినా ప్రధాని అనుకున్నట్టే గురువారం శంకుస్థాపన చేశారంటే న్యాయ వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వానికి ఏపాటి గౌరవముందో తేటతెల్లమవుతోంది.
        'జై జవాన్‌- జై కిసాన్‌' అన్న మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నినాదం కొన్ని దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగింది. కానీ సుదీర్ఘ దేశ సరిహద్దును కాచే జవాన్లు, నూట పాతిక కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్నల ప్రయోజనాలను గాలికొదిలేసి దేశ విదేశీ కార్పొరేట్లకు జై కొట్టడమే ఈ సర్కారు విధానంగా మారింది. మోడీ సర్కారు తెచ్చిన మూడు వినాశకర వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రైతులను నష్టపర్చి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేవే. ఆ లోగుట్టు అర్ధమైనందునే ఆందోళనలో ఉన్న అన్నదాతలు ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించి కార్పొరేట్‌ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరింత విస్తరిస్తున్నారు. జియో ఫోన్లను, అదానీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ సంక్షోభంతో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు రుణ మాఫీ చేస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ తింటుందంటూ తిరస్కరించే పాలకులు కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల పారు బాకీలను మాఫీ చేస్తారు. రక్షణ బడ్జెట్‌ను హేతుబద్ధీకరించడం పేరిట మాజీ సైనికులకిచ్చే పింఛన్లను కత్తిరించడానికి తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఏం దేశభక్తి? పొదుపు చెయ్యాలంటూనే విదేశీ కంపెనీల నుండి అధిక ధరకు ఆయుధాలు కొనుగోలు చేయడం ఎవరి కోసం? నిరంతరం దేశభక్తి, జాతీయవాదం వల్లించే కేంద్రప్రభుత్వం రక్షణ రంగ పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 74 శాతం వరకు అనుమతించడం విదేశీ కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరవడమే.
       బ్రిటిష్‌ పరిపాలనా కాలం నాటి నుండి ఉన్న కార్మిక చట్టాలను కుదించి కోడ్‌లుగా మార్చి కార్మికులకున్న రక్షణలు తొలగించి యజమానుల ప్రయోజనాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నదీ సర్కారు. కోవిడ్‌ విపత్తుతో బాధల్లో ఉన్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యాన్ని సైతం స్తంభింపజేసింది. అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రం రకరకాల పేర్లతో లక్షల కోట్ల రాయితీల్ని కట్టబెడుతోంది. కోవిడ్‌ బారినుండి ప్రజలను కాపాడేందుకు అవసరమైన వైద్య ఆరోగ్య సౌకర్యాలు కల్పించడానికి, ఆదాయాల్లేని ప్రజలకు ఆహార ధాన్యాలు ఉచితంగా అందించడానికీ నిధుల కొరతను సాకుగా చూపే ప్రభుత్వం సుమారు 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో భవన నిర్మాణాలకు పూనుకోవడం తగని పని. ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలకు తగినంతగా భవనాలున్నా కొత్తవి నిర్మించ పూనుకోవడం రియల్‌ ఎస్టేట్‌ కుబేరుల లాభాల కోసమేనని వేరుగా చెప్పనక్కరలేదు. అంతేగాక జాతీయోద్యమ చిహ్నాలుగా ఉన్న పార్లమెంటు భవనం, ఎర్రకోట తదితర భవనాల ప్రాముఖ్యతను తగ్గించడం కోసం ఈ కొత్త నిర్మాణాలు చేపడుతున్నారన్న వాదనను కాదనలేం. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఇలాంటి భవన నిర్మాణాలను, రామ మందిర నిర్మాణాలను తమ విజయాలుగా చెప్పుకొనే హిందూత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలి.