Jan 20,2023 18:46

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి : జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూముల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్‌ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో అసైన్‌మెంట్‌ భూములు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు భూమి కేటాయింపు, రీ సర్వే, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు, క్లరికల్‌ కరెక్షన్స్‌ ఆఫ్‌ మాడ్యుల్స్‌ డిజిటల్‌ సిగేచర్‌ స్టేటస్‌ తదితర అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయాతో కలిసి తహశీల్దార్లతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాలలో తహశీల్దారులు వారి వారి విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పటి వరకు అన్ని మండలాలలో అసైన్‌మెంట్‌ భూములు దాదాపు 500 ఎకరాలు గుర్తించామన్నారు. వారంలోగా 800 ఎకరాల భూమిని గుర్తించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. భూముల గుర్తింపును ఆర్‌డిఒలు స్వయంగా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని తహశీల్దార్లకు సూచించారు. వారి పరిధిలోని వాగులు, వంకలు, పోరంబోకు స్థలాలను కాపాడాలన్నారు. తహశీల్దారులందరూ ప్రతి మండలంలో గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వారీగా ప్రభుత్వ భూమి గుర్తించి నివేదిక పంపాలన్నారు. ఈ విషయంలో అలసత్వం చూపితే సహించేది లేదన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు స్థలాల కేటాయింపును త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. రీ సర్వే అంశంలో భాగంగా 40 గ్రామాలలో అన్ని మాడ్యూల్స్‌ పూర్తయ్యాయని తెలిపారు. 14 గ్రామాలలో ఒక మాడ్యూల్‌, 17 గ్రామాలలో రెండు మాడ్యూల్స్‌ పెండింగ్‌ ఉన్నాయని, వీటిని వెంటనే పూర్తి చేయాలని సంబంధిత తహశీల్దార్లను, రీ సర్వే అధికారులను ఆదేశించారు. త్వరలో మరో 25 గ్రామాలలో కొత్తగా రీ సర్వే మొదలు కాబోతోందని చెప్పారు. ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులపై దృష్టి పెట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత మెరుగ్గా రీ సర్వే పనిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. రీ సర్వేలో సాధారణంగా జాయింట్‌ ఖాతా, డిస్ప్యూట్స్‌, ఆక్రమణలు, పొజిషన్‌ మార్పులలో ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయని వాటిని ప్రత్యేక దృష్టితో పరిశీలించి రైతులతో సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే గ్రామాలలో ముందుగానే టామ్‌ టామ్‌ ప్రచారం చేయాలని, రీ సర్వే బృందం ఒకటి, రెండు రోజులు ఆ గ్రామంలోనే ఉండాలన్నారు. ఆర్‌డిఒలు, తహశీల్దార్లు వారానికి ఒకరోజు రీ సర్వే జరుగుతున్న గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన చోట ఏదేని కారణాలవల్ల ఇంకా భూహక్కు పత్రాలు పంపిణీ చేయని గ్రామాలలో సమస్యలు పరిష్కరించుకొని త్వరితగతిన భూహక్కుపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పూర్తయిన తర్వాత తప్పకుండా రైతులతో సంతకాలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సర్వే సిబ్బంది తహశీల్దార్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని నిర్దేశించిన కాల పరిమితిలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శ్మశాన వాటికలు లేని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెంటనే శ్మశాన వాటికల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలోని 288 గ్రామాలలో 181.59 ఎకరాలను గుర్తించడం అంచనా కాగా ఇప్పటి వరకు 146 గ్రామాలలో కనీసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరా లోపు స్థలాలను గుర్తించి ఆమోదం కొరకు జిల్లా సచివాలయానికి పంపామని తెలిపారు. మిగిలిన మండలాలలో కూడా త్వరితగతిన స్థలాలను గుర్తింపు పూర్తి చేసి ఆమోదానికి పంపించాలన్నారు. ఆమోదించిన బరియల్‌ గ్రౌండ్‌ సర్వే నెంబర్లను ఆన్‌లైన్‌ చేసి మండలాల వారీగా అడంగల్‌ కాపీని జిల్లా కేంద్రానికి పంపించాలని పేర్కొన్నారు. అనంతరం క్లరికల్‌ కరెక్షన్స్‌ ఆఫ్‌ మాడ్యుల్స్‌-డిజిటల్‌ సిగేచర్‌ ప్రగతిపై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, అన్ని మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.