- వందమంది కుబేరుల వద్ద పోగు పడిన సంపద 57.3 లక్షల కోట్లు
- ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని పీల్చిపిప్పి చేశాయి. పాలకవర్గాలు ఘనంగా చెప్పుకున్న సరళీకరణ ఆర్థిక విధానాలు సామాన్యుల మూలుగులను పిండేశాయి. ఫలితంగా అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. కరోనా కష్టకాలంలోనూ సంపన్నుల సంపద మరింతగా పెరగడానికి, సామాన్యుడిని మరింత దీనంగా మారడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలే కారణమని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక కుండ బద్దలు కొట్టింది. 'ఇనీక్వాలిటీ కిల్స్ 2022' పేరుతో సోమవారం విడుదల చేసిన ఈ నివేదికలో ఆక్స్‌ఫామ్ దిగ్భ్రాంతికరమైన ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే ఈ విధానాలపై పునరాలోచించాలని సూచించడంతో పాటు తక్షణం సంపద పన్నును విధించాలని సూచించింది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఏడాది కాలంలో 84 శాతం మంది ప్రజానీకం ఆదాయం గణనీయంగా తగ్గింది. జీవితాలు కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఏదో రకంగా బతకడానికే నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో శత కోటీశ్వరుల సంఖ్య 102 నుండి 142కు పెరిగింది. 2021వ సంవత్సరంలో దేశంలోని వంద మంది సంపన్నుల సంపద 57.3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. కరోనా కష్టకాలంలోనూ (మార్చి 2020నుండి నవంబర్ 2021) వరకు వీరి సంపద 23.14 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందని నివేదిక పేర్కొంది.
సామాన్యులు కష్టాలు పడుతుంటే వీరి సంపద ఇంతలా పెరగడానికి మోడీ ప్రభుత్వం అనుసరించిన ప్రైవేటీకరణ విధానాలే కారణమని విశ్లేషించింది. కార్పొరేట్లపై కనీసం 4 శాతం సంపద పన్ను విధించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.
ప్రైవేటీకరణ ఫలితంగా భారతీయ కుటుంబాలు చేస్తున్న మొత్తం ఖర్చులో 43శాతం ఔషధాలకు, 28శాతం ప్రయివేటు హాస్పిటల్స్‌కు ఖర్చు చేయాల్సివస్తోందని నివేదిక పేర్కొంది. పేదలు, మధ్య తరగతి..ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని కరోనా సంక్షోభం తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక..ప్రయివేటును అనివార్యంగా ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది. 'మొత్తం వైద్యరంగాన్ని ప్రయివేటు హాస్పిటల్స్ నియంత్రిస్తున్నాయి. అవుట్ పేషెంట్ వైద్య సేవల్లో 74శాతం, ఇన్‌పేషెంట్ సేవల్లో 65శాతం ప్రయివేటు వాటాగా ఉంది. ప్రయివేటు హాస్పిటల్స్ వైద్య చికిత్సలపై, అవి వేసే బిల్లులపై పాలకులు ఎలాంటి నియంత్రణా విధించటం లేదు.' అని పేర్కొంది. 'వైద్యంపై ప్రపంచ దేశాల సగటు వ్యయం 10శాతం ఉంటే, భారత్‌లో మాత్రం మొత్తం జీడీపీలో 1శాతం నిధుల వ్యయం కూడా లేదు.' అని తెలిపింది.
విద్యారంగంలోనూ అంతే..
ప్రయివేటు విద్యను ప్రోత్సహించడానికి జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) కేంద్రం తీసుకొచ్చింది. మరోవైపు స్కూల్ ఫీజులు చెల్లించలేక 35శాతం పిల్లలు పాఠశాలను మానేశారని నివేదిక తెలిపింది. అణగారిన వర్గాల్లో ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, బాలికలు విద్యకు దూరమయ్యారు. విద్యను మార్కెట్‌కు వదిలేయటం వల్ల సామాజికంగా నేడు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
తగ్గిన భరోసా
'సామాజిక పథకాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గింది. ఫలితంగా పేదల జీవితాలక భరోసా తగ్గిందిమొత్తం బడ్జెట్‌లో 0.6శాతం కేటాయింపులను ఈ పథకాలకు కోసం కేంద్రం కేటాయించింది. గత ఏడాదితో పోల్చినా ఈ కేటాయింపు తగ్గింది. మరోవైపు పేదలు. కార్మికులు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కుంటున్నారు' అని పేర్కొంది.
ఒక్క శాతం సంపద పన్ను వేస్తే....
దేశంలోని 98 శత కోటీశ్వరుల కుటుంబాలపై ఒక్క శాతం సంపద పన్ను విధిస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడు సంవత్సరాల పాటు దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చు. లేదా ఏడాది పాటు పాఠశాల విద్యను దేశంలోని పిల్లలందరికి ఉచితంగా అందించవచ్చు.
4 శాతం విధిస్తే
అదే 4 శాతం సంపద పన్ను విధిస్తే 2 సంవత్సరాల పాటు కనీసం రెండు సంవత్సరాల పాటు ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కార్యక్రమాలన్నింటిని నిర్వహించవచ్చు. 17 సంవత్సరాల పాటు దేశ వ్యాప్తంగా మధ్యాహ్నా భోజన పథకాన్ని కొనసాగించవచ్చు.
ఆయు: ప్రమాణం పైనా....
ఉన్నత కులాల మహిళలతో పోలిస్తే దళత మహిళల ఆయు:ప్రమాణం సుమారుగా 15 సంవత్సరాలు తక్కువ. ఉన్నత కులాలకు చెందిన హిందువుల కన్నా ఆదివాసీల జీవిత కాలం 4 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటోంది. ముస్లింల ఆయు: ప్రమాణం ఒక సంవత్సరం తక్కువగా ఉంది. దళిత కులాలకు చెందిన వారి ఆయు: ప్రమాణం కనీసం మూడు సంవత్సరాలు తక్కువ! ఆర్థికాంశాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.










