Aug 13,2021 06:31

     ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల్ని (జిఐసి) ప్రైవేటుపరం చేసేందుకు ఉద్దేశించబడిన జనరల్‌ ఇన్సూరెన్సు బిజినెస్‌ (నేషనలైజేషన్‌) యాక్ట్‌ (జిబ్నా) సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదింపజేసుకున్న తీరు జుగుప్సాకరం. బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి, సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశాయి. ససేమిరా అన్న ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో మార్షల్స్‌ను నియోగించి, మహిళా పార్లమెంటు సభ్యుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించి బిల్లును ఆమోదింపజేసుకోవడం దారుణం. 'సభలో సభ్యుల కంటె మార్షల్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంద'నీ, 'పార్లమెంటులో కూడా మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొంద'న్న విపక్ష నేతల వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను విశదపరుస్తున్నాయి. జిబ్నా సవరణ బిల్లును ఆగస్టు 3న ప్రతిపక్షాల నిరసనల నడుమనే లోక్‌సభ లోనూ ఆమోదింపజేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ (2021-22)ను ప్రవేశ పెట్టినపుడు నిర్మలా సీతారామన్‌... ఒక ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీనీ, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా ప్రయివేటీకరిస్తామన్నారు కాని వాటి పేర్లు చెప్పలేదు. ఇప్పుడు మొత్తం సాధారణ బీమా రంగాన్నంతటినీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో కనీసం 51 శాతం వాటా ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉండాలని జిబ్నా లోని 10(బి) సెక్షన్‌ నిర్దేశిస్తోంది. ఇప్పుడు కేంద్రం సవరణ ద్వారా ఆ సెక్షన్‌నే తొలగిస్తోంది. అంటే ఒకటి కాదు అన్ని జిఐసి సంస్థలనూ ప్రైవేటుపరం చేయడానికి పార్లమెంటు ఆమోదాన్ని పొందింది. బడ్జెట్‌ నాటి మాట ఇలా మారిందన్నమాట! అలాగే ప్రభుత్వ వాటా 51 శాతం కన్నా తక్కువున్న జిఐసి సంస్థలకు జిబ్నా చట్టమే వర్తించబోదని ఒక కొత్త సెక్షన్‌ 24(బి) చేర్చడం ద్వారా జిబ్నాను సున్నాగా చేసేస్తోంది. ఎంత మోసం !
     దేశంలోని 107 ప్రయివేటు సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం 1971లో జాతీయం చేసినప్పుడు వాటిపై కేవలం రూ.19.5 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ యాభయ్యేళ్లలో అవి దినదిన ప్రవర్ధమానమై ప్రజల ఆస్తులకు భరోసా కల్పించేలా మెరుగైన పాలసీలను అందిస్తున్నాయి. బీమా రంగంలో ప్రయివేటు కంపెనీలను 1999లో అనుమతించినా... ఇప్పటికీ అవి ప్రభుత్వ రంగ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. రీ-ఇన్సూరెన్స్‌లో ఒక ప్రయివేటు కంపెనీ వచ్చినా, అది ఏడాదిలోపే మూతబడింది. నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు (నేషనల్‌, న్యూ ఇండియా, ఓరియెంటల్‌, యునైటెడ్‌ ఇండియా) 22 సంవత్సరాలుగా ప్రయివేటు కంపెనీలతో పోటీ పడుతూ కూడా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లను చెల్లించాయి. దేశ ప్రణాళికా పెట్టుబడులకు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అందించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించిన బీమా సంస్థలను ప్రైవేటుపరం చేయడం ఆత్మహత్యా సదృశం. కాని, మోడీ సర్కారుకు దేశ ప్రయోజనాలకన్నా దేశ, విదేశీ కార్పొరేట్లను సంతృప్తి పర్చడం, అందు కోసం ప్రభుత్వ రంగాన్ని బలి చేయడం ప్రధానం అయిపోయింది.
     ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ రంగ జిఐసి సంస్థలు మార్కెట్‌లో 42 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ పాలసీలను ప్రజలకు అందించటంలో అగ్రభాగాన ఉన్నాయి. వీటితోపాటు కరోనా సమయంలో అతి తక్కువ ప్రీమియంతో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా 'కరోనా కవచ్‌' పథకాన్ని తీసుకొచ్చాయి. కోవిడ్‌ బాధితులకు సమర్థవంతంగా క్లెయిములు చెల్లించాయి. ప్రజలను ఇంతలా ఆదుకుంటున్న ప్రభుత్వ రంగ బీమా కరపెనీలను ప్రయివేటీకరించటం ప్రజలకు తీరని నష్టం. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను కాపాడుకోవడం కేవలం ఉద్యోగులు, ఏజంట్ల బాధ్యత మాత్రమే కాదు. ఆయా ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు, పాలసీదార్లు, ప్రజాస్వామికవాదులు కూడా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలను తిప్పికొట్టాలి. బీమా రంగాన్ని కాపాడుకోవాలి.