Nov 03,2020 07:41

కరోనా లాక్‌డౌన్‌తో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వరంగం లోని ప్రజా రవాణా (ఆర్‌టిసి) పునరుద్ధరణ మంచి పరిణామమే అయినా ఈ సందర్భంగా పరస్పరం రెండు ఆర్‌టిసి లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రజా కోణానికి బదులు ప్రైవేటు కోణాన్ని ఆవిష్కరించడం ఆందోళనకరం. తమ అగ్రిమెంట్‌ తెలుగు ప్రజల సౌకర్యార్ధమేనంటూ రెండు రాష్ట్రాలూ కూడబలుక్కొని ఆలపిస్తున్నవి ప్రైవేటు రాగాలని ఒప్పందాన్ని పరికించి చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం ఆర్‌టిసి బస్సులు నడుస్తున్న కొన్ని రూట్లను ప్రైవేటుకు అప్పగించే కుట్ర ప్రస్ఫుటిస్తోంది. కరోనా నేపథ్యంలో మార్చి 22న కేంద్రం విధించిన జనతా కర్ఫ్యూ లగాయతు ఏడు నెలలకు పైన ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ మధ్య ఆర్‌టిసి బస్సులు నిలిచిపోయాయి. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర రాకపోకలకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్‌టిసి బస్సులు కదల్లేదు. అంతర్రాష్ట్ర ఒప్పందానికి తెలంగాణ పట్టుబట్టడం, ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య చర్చల్లో ఎడతెగని ప్రతిష్టంభన కారణంగా దసరాకు సైతం బస్సులు తిరగలేదు. చర్చల పేర ఆర్‌టిసి లు కాలయాపన చేస్తున్న సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు తిప్పి ప్రయాణీకుల నుంచి అందినకాడికి దోచుకున్నారు. ప్రభుత్వ రవాణ లేని కారణంగా గత్యంతరం లేక ప్రజలు ప్రైవేటును ఆశ్రయించి గోళ్లూడగొట్టుకున్నారు.
          దసరా వెళ్లిన వారానికి రెండు రాష్ట్రాలూ కూర్చొని తీరిగ్గా కూర్చొని చేసుకున్న ఒప్పందం ఆర్‌టిసి లను క్రమేపి నిర్వీర్యం చేసి ప్రైవేటుకు పట్టం కట్టింది. ఇద్దరూ చెరి సమానంగా 1.61 లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పుకుంటామనడం పైకి న్యాయంగానే అనిపిస్తుంది. అసలు పితలాటకం వేరే ఉంది. గతంలో ఎ.పి 1,009 సర్వీసులను 2.65 కిలోమీటర్ల మేర నడిపింది. ఇప్పుడు 1.61 లక్షల కిలోమీటర్లు, 638 సర్వీసులకు తగ్గించుకుంది. తెలంగాణ ఇంతకు ముందు 750 సర్వీసులను 1.52 లక్షల కిలోమీటర్లు నడిపింది. ఇప్పుడు 820 సర్వీసులకు 1.61 లక్షల కిలోమీటర్లకు పెంచుకుంది. ఏతావాతా చూస్తే రెండు ఆర్‌టిసి లు కలిపి ఇప్పటి వరకు 1,759 బస్సులను నడపగా తాజా అగ్రిమెంట్‌లో 1,458 బస్సులనే నడపుతామంటున్నాయి. రమారమి 301 సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. నలభై వేల కిలోమీటర్లు ఇద్దరూ తిప్పకుండా వదిలేస్తున్నారు. ఇంతకాలం ఇద్దరూ కొట్లాడుకుంది బస్సులను, రూట్లను వదిలేయడానికా? అలా చేస్తే ఎవరికి లాభం? తప్పనిసరిగా ప్రైవేటు ఆపరేటర్లు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. మరో విషయమేంటంటే...కరోనా వలన మరో ఆర్నెల్లపాటు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాల్లేవు, లక్ష కిలోమీటర్లు కూడా బస్సులు తిప్పలేము, ఈ ఒప్పందం పైనా పునరాలోచన చేయొచ్చంటున్నారు ఒప్పందంలో పాల్గొన్న అధికారులు. ఈ పలుకు గవర్నమెంట్‌ బస్సులు ఇంకా తగ్గుతాయన్న సంకేతమేగా?
         గతంలో ఆసియాలో నెంబర్‌ వన్‌గా మన ఆర్‌టిసి వెలుగొందగా సరళీకరణ విధానాలొచ్చాక ప్రభుత్వాల నిరాదరణతో దాని ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో ఆర్‌టిసి ని ముక్కలు చేసి ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించగా కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటనలతో వెనక్కి తగ్గింది. అనంతరం వచ్చిన కాంగ్రెస్‌ సైతం ఆర్‌టిసి ని దెబ్బ తీసి దొడ్డిదారిలో ప్రైవేటును చొప్పించింది. కేంద్రం లోని కాంగ్రెస్‌ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ద్వారా ప్రజా రవాణాను దెబ్బతీయగా, బిజెపి ప్రభుత్వం మొత్తానికే పీక నొక్కేందుకు 'నూతన రవాణా చట్టం' తీసుకొచ్చింది. అలాంటి వినాశకర చట్టానికి వైసిపి, టిఆర్‌ఎస్‌, టిడిపి మద్దతిచ్చాయి. కొత్త రవాణ చట్టం ప్రభుత్వ ప్రజా రవాణాను మూసేసి ప్రైవేటుకు హస్తగతం చేయమంటోంది. అంతర్రాష్ట్ర ఒప్పందం ముసుగులో రెండు తెలుగు రాష్ట్రాలూ అందుకే నడుంకట్టాయి. రాష్ట్ర విభజన జరిగి ఆరున్నరేళ్లు గడిచినా ఆర్‌టిసి విభజనను పూర్తి చేయకుండా నానబెడుతున్న కేంద్ర బిజెపి సర్కారును రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ పల్లెత్తు మాట అనకుండా ఒప్పందాలంటూ ప్రైవేటు బాట పట్టడం దారుణం. రాష్ట్ర విభజనతో రెండు వైపులా ఆర్‌టిసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ప్రభుత్వంలో విలీనం అన్న ఎపి సర్కారు ఇంకా పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టలేదు. విలీనం అడిగిన కార్మికులపై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతటి నిర్బంధం ప్రయోగించిందో చూశాం. ప్రైవేటు కోసం ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్న ప్రభుత్వాల నిజ స్వరూపం ఆర్‌టిసి ఒప్పందంతో మరోసారి తేటతెల్లమైంది.