Jan 02,2023 09:45

పాత్రికేయులకు కానుకలు అందిస్తున్న నవీన్‌ నిశ్చల్‌

          హిందూపురం : 2023వ సంవత్సరం నుంచి హిందూపురం నియోజకవర్గంలో పరాయి పాలనకు స్వప్తి పలుకుదామని ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ పేర్కొన్నారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్బంగా ఆయన కార్యాలయ ఆవరణంలో పాత్రికేయులు, పార్టీ కార్యకర్తలకు దుస్తులు, తిరుపతి లడ్డు, కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడూ నమ్ముకున్న కార్యకర్తల కోసమే పని చేస్తానని చెప్పారు. అధికారం ఉన్నా, లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కష్టపడి పంట మనం పండిస్తే, దాన్ని వేరే వ్యక్తులు తింటున్నారని చెప్పారు. నూతన సంవత్సరం నుంచి పరాయి పాలకు స్వస్తి పలుకుదాం అన్నారు. స్థానికులు ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా వైసీపీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కొంత మంది పార్టీలోకి వలస వచ్చి రాజ్యం ఏలుతున్నారని, వారందరూ 2024లో పార్టీ అధికారంలోకి రాకుంటే ఏ ఒక్కరూ పార్టీలో ఉండరన్నారు. అధికారం కోసం పార్టీలు మారే వారికి అందలం ఎక్కించారన్నారు. పార్టీ అభివృద్ది కోసం, నమ్మకున్న కార్యకర్తల కోసం, ప్రజా సమస్యల కోసం కష్టపడి పని చేసి, జైళ్లకు వెళ్లిన వారికి ప్రస్తుతం తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనప్పటికి పార్టీలో ఉండి తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉండి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.