Oct 28,2023 00:06

ప్రాణాలు తీస్తున్న పనిభారం



ప్రాణాలు తీస్తున్న పనిభారం

సెలవు కావాలంటే డబుల్‌ డ్యూటీలు
ఒత్తిడి తాళలేక డ్రైవర్లకు జంట వ్యాధులు
శ్రీకాళహస్తి ఆర్టీసీలో నిరంకుశ వైఖరి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
మోయలేని పనిభారం.. భరించలేని యాజమాన్యం ఒత్తిళ్లు..వెరసి ఆర్టీసీ డ్రైవర్ల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం నిరంకుశ వైఖరికి తోడు.. కఠినతర లక్ష్యాలు డ్రైవర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. నిత్యం శ్రామికులకు కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. డ్రైవర్‌ ఉద్యోగం అంటేనే ఎంతోబాధ్యతతో.. ఒత్తిడితో, క్రమశిక్షణతో, అప్రమత్తతతో కూడుకున్న పని. ఆర్టీసీలో ''ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం'' అన్న నినాదంలానే డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా వారిరి గమ్యాలకు చేరుస్తున్నారు. ఈ క్రమంలో పనిఒత్తిడిని తట్టుకోలేక వారు గమ్యం చేరేలోపు కానరానిలోకాలకు చేరిపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో యాజమాన్యం తీరు డ్రైవర్లకు ప్రాణ సంకటంగా మారుతోంది. యాజమాన్యం ఒత్తిళ్లకు తాళలేక గడిచిన రెండేళ్ల కాలంలో పదిమంది డ్రైవర్లు గుండెపోటుతో, ఇతరత్రా వ్యాధులతో మృత్యువాతపడ్డారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో డ్రైవర్లు యాజమాన్యం వేధింపులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సెలవు కావాలంటే డబుల్‌ డ్యూటీలు
ఆధ్యాత్మిక పట్టణం దృష్ట్యా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది. దశాబ్దం కిందట నష్టాల్లో నడిచినా ప్రస్తుతం లాభాల్లోనే నడుస్తుంది. అయితే మరింత ఆదాయం సమకూర్చడంలో భాగంగా యాజమాన్యం అనుసరిస్తున్న తీరు ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణంపైకి తెస్తోంది 'పిండి కొద్దీ రొట్టె' అంటారు పెద్దలు. అయితే పిండే లేకుండా పెద్దఎత్తున ఆదాయం రావాలంటే కుదరదన్న కనీస జ్ఞానాన్ని మరిచి యామాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుండటంతో అసలుకే మోసం వస్తోంది. విలీనానికి ముందు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో అర్డినరీలు, ఎక్స్‌ప్రెస్‌లు, నాన్‌స్టాప్‌ (మెట్రో), డీలక్స్‌ బస్సులను కలుపుకుని 110 సర్వీసులు నడిచేవి. సుమారు 230 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తించేవారు. కానీ విలీనం తర్వాత బస్సు సర్వీసుల సంఖ్యను 96కు పరిమతం చేశారు. డ్రైవర్ల సంఖ్య 195కు పడిపోయింది. దీంతో ఉన్న వారితోనే అదనపు పనిగంటలు చేయించుకుంటూ నిర్ధేశిత లక్ష్యాలను చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా గతంలో ఉన్న 8గంటల రోజు వారీ పని విధానానికి మంగళం పాడి 16 గంటల పనివిధానానికి శ్రీకారం చుట్టారు. ఆ 16 గంటల్లోనైనా డ్రైవర్‌, కండెక్టర్‌ డ్యూటీ దిగుతాడా అంటే అదీ అనుమానంగా మారింది. ఉదాహరణకు శ్రీకాళహస్తి- తిరుపతి మార్గంలో ఓ నాన్‌ స్టాప్‌ బస్సు 16 గంటల్లో 6 ట్రిప్పులు తిరగాల్సి ఉంటుంది. అంటే 456 కిలోమీటర్ల తిరగాల్సి ఉంటుంది. అయితే శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య ఉన్న ట్రాఫిక్‌ దృష్ట్యా 5 ట్రిప్పులకే 16 గంటలు ముగిసిపోతోంది. కానీ మిగిలిన ఒక్క ట్రిప్పు, కిలోమీటర్లు కూడా తిరగాల్సిందేనంటూ యాజమాన్యం హుకూం జారీ చేస్తుండటంతో వారి ఆడ్యూటీని పూర్తి చేసుకునేందుకు తెల్లారిపోతోంది. అయితే మరోరోజు వారికి విశ్రాంతినిచ్చినా మరో రోజు సెలవు కావాలంటే డబుల్‌ డ్యూటీ చేయాలంటూ పేచీ పెడుతున్నారు. దీంతో రెండు రోజుల విశ్రాంతి కోసం డ్రైవర్లు సుమారు 34 గంటలు పనిచేస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. సరైన విశ్రాంతి లేక, నిద్ర లేక, తిండి తినక బీపీ, షుగర్‌ లాంటి జంటవ్యాధుల భారినపడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. సుమారు 70శాతం మంది డ్రైవర్లు బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్ల కాలంలో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు 10మంది డ్రైవర్లు, ఓ కండెక్టర్‌ అనారోగ్యం పాలై మరణించడం విచారకరం.
ఈ ఏడాది జనవరిలో శేషయ్య, అక్టోబరులో ధన్‌రాజ్‌ అనే డ్రైవర్లు గుండెపోటుతో మరణించారు. అదేవిధంగా అక్టోబరు నెలలోనే డి.రాంబాబు అనే డ్రైవరు హైబీపీ కారణంగా కిడ్నీ ఫెయిల్‌ అయ్యి మృత్యువాత పడ్డాడు. రాంబాబు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తనకిచ్చిన 16 గంటల డ్యూటీని పూర్తి చేసుకున్నాడు. తర్వాతి రోజు తనకు విశ్రాంతి. ఆ తర్వాతి రోజు డయాలసిస్‌ చేసుకునేందుకు లీవు కావాలని కోరితే డబుల్‌ డ్యూటీ చేయాలంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఈ క్రమంలో రాంబాబు డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మార్గంలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు రోజులో 4 ట్రిప్పులు 344 కిలోమీటర్లు బస్సు నడిపితే మరోరోజు వారికి విశ్రాంతి దొరికేది. కానీ ఆ విధానానికి ప్రస్తుత యాజమాన్యం స్వస్తి పలికి ప్రతిరోజూ డ్యూటీ చేయాలంటూ పెత్తనం చేస్తుండటం గమనార్హం. ఈ విధానంపై డ్రైవర్లు మండిపుతున్నా, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న యాజమాన్యం గుడ్డిగా ముందుకెళ్లడం చూస్తుంటే వారి నిరంకుశత్వానికి అద్దంపడుతోంది.
ఆదాయాన్ని వదిలేసి..
ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ డ్రైవర్లు, కండెక్టర్లపై పనిభారం మోపుతున్న శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో యాజమాన్యం అసలైన ఆదాయమార్గాలను మాత్రం వదిలేస్తోంది. శ్రీకాళహస్తి- నెల్లూరు, శ్రీకాళహస్తి- చెన్నరు, శ్రీకాళహస్తి- నాయుడుపేట, శ్రీకాళహస్తి- బెంగుళూరు, శ్రీకాళహస్తి- వేలూరు మార్గాలు ఆర్టీసీకి మెరుగైన ఆదాయాలు తెచ్చిపెట్టాయి. అయితే శ్రీకాళహస్తి- నెల్లూరు మార్గంలో నడుస్తున్న 7 సర్వీసులను 3కు, చెన్నరు మార్గంలో 8కి బదులు 4కు, బెంగుళూరు మార్గంలో 6కు బదులు 4, వేలూరు(3), నాయుడుపేట(3) మార్గంలో అసలు బస్సు సర్వీసులే లేకుండా రద్దు చేయడంతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు. శ్రీకాళహస్తి సెక్టార్‌ పరిధిలో ఉన్న నాయుడుపేట బస్సు సర్వీసులను సూళ్లూరుపేటకు అప్పగించడం చూస్తుంటే ఇక్కడ యాజమాన్యం అవివేకానికి అద్దం పడుతోందంటూ డ్రైవర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. డ్రైవర్ల సంఖ్యను తగ్గించడం, సర్వీసులు ఎత్తివేయడంతో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు నష్టం రావడమే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఇకనైనా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో యాజమాన్యం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారాలు మోపడం మాని అసలైన ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం చాలా ఉందని కోరుతున్నారు.