Sep 05,2020 08:01

కరోనా బాధితుల కోసం రోజుకు రూ.10 కోట్ల పైబడి ఖర్చు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన చూస్తే కరోనాను కట్టడి చేయడంలో పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతుంది. కనివిని ఎరుగని రీతిలో విజృంభిస్తున్న మహమ్మారిని అన్ని శక్తులూ ఒడ్డి ఎదుర్కోవాలి కానీ ఇలా ఇంత ఖర్చు చేశాము..అంత ఖర్చు చేశాము..అంటూ లెక్కలేసుకోవడం సముచితం కాదు. కోవిడ్‌ కేంద్రాల్లో, చికిత్స అందజేస్తున్న ప్రభుత్వాసుపత్రుల్లో కల్పిస్తున్న సదుపాయాలకు ముఖ్యమంత్రి చెబుతున్న ఖర్చులకు పొంతన లేదు. ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు కనీసం వ్యక్తిగత రక్షణ కిట్లు కూడా ఇచ్చింది లేదు. సదుపాయాల కొరతను తీర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు విధులు నిర్వహిస్తూనే నల్ల రిబ్బన్లు ధరించి నిరసనాందోళన చేపట్టినా ప్రభుత్వానికి దయ రాలేదు. కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితే పట్టించుకునే నాథుడూ కరువే. రిఫరెన్సు ఉంటే కానీ చికిత్స అందని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. 'మాకు పాజిటివ్‌ వచ్చింది మొర్రో' అంటూ జనం బెంబేలెత్తినా, 'అబ్బే ఏం కాదు ఇళ్లలోనే ఉండండి. మీ చావు మీరు చావండ'ని ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులిపేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో లెక్కలేనన్ని. చేసేదేమీ లేక ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులు, స్వీయ రక్షణ మందులపై ఆధారపడి బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖర్చు భరించలేని నిరుపేదలు కోవిడ్‌ ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొంటే వాటిని సరిచేసి యుద్ధ సన్నాహంతో కరోనాను కట్టడి చేయాల్సిన పాలక పెద్దలు ఖర్చులను ఏకరవు పెట్టడం అమానుషం.
నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నందునే కోవిడ్‌ పాజిటివ్‌ రేటింగ్‌ పెరిగిందంటూ కరోనా కేసుల పెరుగుదలను ఒక ఘనతగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్నది రాష్ట్రంలోనే. దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. కరోనా మామూలు జ్వరమే.. పారాసిటమాల్‌ వేసుకుంటే పోతుందని వైరస్‌ ముంచుకొచ్చిన తొలినాళ్ల లోనే తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత 'కరోనాతో సహజీవనం తప్పదు' అని చేతులెత్తేసింది. నిపుణులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు 'ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు వద్దే వద్దు' అని మొత్తుకుంటున్నా లెక్క చేయకుండా పరీక్షలు కానిచ్చేస్తున్నారు. రాష్ట్రం లోని చాలా యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూలు ప్రకటించేశాయి. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకూ తేదీలు ఖరారు చేసేశారు.
దేశం మొత్తంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తూ బెంబేలెత్తిస్తోంది. కరోనా కట్టడికి అనాలోచిత లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రజల బతుకుదెరువులను బుగ్గి చేసిన మోడీ సర్కార్‌ ఆ తర్వాత 'చప్పట్లు కొట్టండి..దీపాలు పెట్టండి' అంటూ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఫలితం లేకుండా పోయింది. కరోనా మహమ్మారి తొలుత వెలుగు చూసిన చైనాలో అక్కడి ప్రభుత్వం దానిని అదుపు చేసి వేగుచుక్కలా దారిచూపినా ఇక్కడి పాలకులు పాఠాలు నేర్వలేదు. మన దేశంలో మొదటి కేసు నమోదైన కేరళ సైతం ప్రశంసనీయ పాత్ర పోషించి కట్టడి చేయగలిగింది. ఆ పాఠాలనూ అటు కేంద్రం కానీ, ఇటు మన రాష్ట్రం కానీ ఒంటబట్టించుకోలేదు.
ప్రతిదానికీ అమెరికా చెప్పినట్టు తలూపే కేంద్ర పెద్దలు కరోనా విషయంలోనూ ట్రంప్‌ వ్యవహారశైలినే అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తోంది. సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ)ని పెంపొందిస్తే కరోనా దానంతటదే సమసిపోతుందంటూ అక్కడి ట్రంప్‌ సర్కార్‌ ఒక వినాశకర వ్యూహాన్ని అమల్జేస్తోంది. ఈ విధానాన్ని అనుసరిస్తే 20 లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ట్రంప్‌ పట్టించుకునే స్థితిలో లేరు. ఇక్కడ మన పాలకుల వ్యవహార శైలి కూడా ట్రంప్‌ తీరునే ప్రతిబింబిస్తోంది. వాస్తవానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ వల్ల కొన్ని వ్యాధుల విషయంలో వర్తించినా కరోనా విషయంలో అది సాధ్యపడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక వైద్య సంస్థలు నివేదించాయి. ఇవేవీ పట్టించుకోని మన ప్రభుత్వాలు సిరో ప్రివెలెన్స్‌ పరీక్షలు నిర్వహించి హెర్డ్‌ ఇమ్యూనిటీ వ్యూహాలను సమర్థించేలా నివేదికలు రూపొందిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ కృష్ణా తదితర జిల్లాల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహించి 41 శాతం ప్రజలకు యాంటీబాడీస్‌ తయారయ్యాయంటూ నివేదికలిచ్చాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగిపోయింది..ఇక కోవిడ్‌ దానంతటదే పోతుంది..ప్రభుత్వాలు చేయాల్సిందేమీ లేదని చేతులు దులిపేసుకునేందుకే ఈ పన్నాగాలు. ప్రజలను ఇలాంటి వినాశకర విధానాలతో మోసగించకుండా మానవతా దృక్కోణంతో ప్రభుత్వాలు పని చేయాలి. ప్రాణాలకు ఖరీదు కట్టే చర్యలు మానుకొని రక్షించే చర్యలకు పూనుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజలు అనే సంగతి గుర్తెరిగి కరోనా బాధితులందరికీ మెరుగైన చికిత్స అందించాలి.