ప్రజాశక్తి-రాయచోటి :ప్రజల ప్రాణ భద్రత మనందరి సామాజిక బాధ్యతని, ఆ దిశగా జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తం, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ గిరీష సంబంధితాధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల మూలంగా ఏవ్వరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, కల్వర్టులు, రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై అవసరం మేరకు వేగ నిరోధకాల సూచిక బోర్డ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మనం తీసుకొనే చర్యలు ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలన్నారు. అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. బస్సులు, లారీలు, ఇతర వాహనాలలో అధిక లోడుతో రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారికి ఫైన్ వేయాలని సూచించారు. పెద్ద వాహనాలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు వెనుక వైపు రేడియం స్టిక్కర్ లు తప్పనిసరిగా ఉండాలని, ఇందుకు సంబంధించి పోలీసు, రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ త్యనారాయణ, జిల్లా రవాణా అధికారి శాంత కుమారి, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.










