Feb 27,2022 06:44
  • గతంలో ఎప్పుడైనా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే కేంద్రంలో ఏ సంఘటనలు, కూటములైనా ఏర్పడ్డాయి. అప్పుడే ఎవరి కోణంలో కూటముల గురించీ, వాటి నాయకత్వాల గురించీ మాట్లాడ్డం ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది. బిజెపి బలం పెరగడం, కాంగ్రెస్‌ బాగా బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలకు మరింత ప్రాధాన్యత కొత్త పరిణామాలు కావచ్చు. కానీ మరోవైపున మోడీ నిరంకుశ పోకడలపై మత రాజకీయాలపె ప్రజలౖ నిరసనలు, రైతాంగ ఉద్యమాలు...వంటివి విజయాలు సాధించడం కూడా చూస్తున్నాం. గతం కన్నా నగంగా కార్పొరేట్‌ ప్రైవేటీకరణ అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను, మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించే ప్రతిఘటన పెంపొందించడమే నేటి తక్షణావసరం అవుతుంది.


తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ దేశ ప్రధాని అవుతారా? బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకురాలు అవుతారా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తమ రాష్ట్ర పాలక నమూనాను జాతీయంగా పెంపొందించాలనుకుంటున్నారా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం అవుతారా? బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ వచ్చే దఫా రాష్ట్రపతి అభ్యర్థి అవుతారా లేక ఎన్‌సిపి సీనియర్‌ నేత శరద్‌ పవార్‌కు ఆ అవకాశం దక్కుతుందా? ఇవీ ఇలాటివీ అనేక ప్రశ్నలు, ఊహాగానాలు మీడియాలో నిరంతరాయంగా సాగుతున్నాయి. రాష్ట్రాల హక్కులపై కేంద్రం లోని నరేంద్రమోడీ ప్రభుత్వ దాడి గురించి కూడా చర్చ వస్తున్నా రాజకీయ కలయికలు, పొందికల గురించిన కథననాలే సింహభాగం ఆక్రమిస్తున్నాయి. కె.సి.ఆర్‌ ఇటీవల ముంబయి వెళ్లి ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌పవార్‌తో చర్చలు జరిపి వచ్చాక కథనాలు మరింత పెరిగాయి. వాస్తవానికి ఆ సమావేశం రోజునే సిపిఎం అధికార పత్రిక 'పీపుల్స్‌ డెమోక్రసీ'లో రాసిన సంపాదకీయం రాజకీయ పొత్తులు రాష్ట్రాల హక్కుల పోరాటం మధ్య తేడాను సూటిగా పేర్కొంది (ప్రజాశక్తి 22.2.22) దానిపై ముంబయి సమావేశాన్ని వ్యతిరేకించినట్టు కొందరు, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటాన్ని బలపర్చినట్టు మరికొందరు మీడియాలో వార్తలిచ్చారు. ఆ సమావేశంలో జరిగిందేమిటనే దానిపై మాత్రమే గాక ఆతిథ్యమిచ్చిన శివసేన నాయకులు చెప్పిన మాటలు కూడా పాక్షిక కోణంలోనే వెలువడ్డాయి.

  • కె.సి.ఆర్‌ మమత ఆశలు

గతంలో లేనంత తీవ్రంగా కె.సి.ఆర్‌ బిజెపి విధానాలపై, ప్రధాని మోడీ తీరుపై విమర్శ చేయడం మంచి పరిణామమే. ఇందుకు కారణాలేమిటనే దానిపై రకరకాల అంచనాలు వారికి వున్నా మతతత్వ రాజకీయాలను ఖండించడం, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఐక్యంగా పోరాడటం నేటి అవసరం. తెలంగాణను సాధించి అభివృద్ధి చేసినట్టే దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి టిఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు కె.సి.ఆర్‌ పదేపదే చెబుతున్నారు. సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులతోనూ ఇతరులతోనూ కూడా చర్చలు జరిపారు. ముంబై పర్యటనకు వెళ్లడానికి ముందు మమతా బెనర్జీ నుంచి ఫోన్‌ వచ్చినట్టు కూడా చెప్పారు. బీహార్‌ లో ఆర్‌.జె.డి నేత తేజస్వి యాదవ్‌, యు.పి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ వంటి వారితోనూ వివిధ రూపాల్లో సంప్రదింపులు జరిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని సభల్లోనూ పదేపదే ప్రశ్నిస్తూ వారి మద్దతు పొందినట్టు చూపిస్తున్నారు. వీటన్నిటి సారాంశంగా కెసిఆర్‌కు జాతీయ స్థాయిలో గొప్ప స్పందన వచ్చినట్టు, ఆయన నాయకత్వం వహించాలన్న పిలుపు వస్తున్నట్టు చెబుతున్నారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన మమతా బెనర్జీ వంటివారు తామే ప్రతిపక్ష కూటమిని నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేగాక బిజెపి కి వ్యతిరేకంగా తనతో కలసి రమ్మంటే సిపిఎం, కాంగ్రెస్‌ అంగీకరించలేదని కూడా మమత విమర్శించారు. మమత పాలనలో బెంగాల్‌లో సిపిఎం పై ఎంత తీవ్ర నిర్బంధం సాగుతున్నదీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వయంగా వెల్లడించారు. బిజెపి కి వ్యతిరేకంగా పోరాటంలో కాంగ్రెస్‌ స్థానమేమిటనేది ఆయా రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి నిర్ణయమవాల్సిందే. బిజెపి ని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్‌తో రాజకీయ సంఘటన కట్టే అవకాశం లేదని కూడా సిపిఎం ప్రకటించింది. కాంగ్రెస్‌ బలహీనపడుతున్న మాట, లౌకికతత్వం కోసం కచ్చితంగా నిలవలేకపోతున్న మాట కూడా నిజమైనా బిజెపి కాంగ్రెస్‌లను ఒకే విధంగా చూడటానికి లేదనేది వాస్తవం (కాంగ్రెస్‌, ప్రాంతీయ పాలక పార్టీల ఆర్థిక విధానాల్లో బిజెపి తో పెద్దగా తేడా వుండదనేది అనుభవం చెప్తున్న సత్యం).

  • ముంబయి భేటీ, హిందూత్వ, కాంగ్రెస్‌ స్థానం

కె.సి.ఆర్‌ ప్రయత్నమంతా తమను దూరంగా పెట్టడానికేనని ఆ పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ముంబయిలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్‌ గురించిన ప్రశ్నలకు ఇది ప్రారంభం మాత్రమేనంటూ కె.సి.ఆర్‌ సమాధానం దాటేశారు. ఆయన తిరిగివచ్చిన మరు రోజునే శివసేన ప్రధాన ప్రతినిధి ఎం.పి సంజరు రౌత్‌ కాంగ్రెస్‌ లేకుండా కూటమి గురించి తామెక్కడా మాట్లాడలేదని స్పష్టంగా చెప్పారు. అయితే అందరినీ కలుపుకొని పోగల సత్తా కె.సి.ఆర్‌ కు వుందని సన్నాయి నొక్కులు నొక్కారు. 'నమస్తే తెలంగాణ' పత్రిక ఇందులో కె.సి.ఆర్‌ సమర్థత గురించిన భాగం మాత్రం ప్రచురించి కాంగ్రెస్‌ గురించిన ప్రస్తావనలు ఎత్తివేసింది! మరో వంక కె.సి.ఆర్‌ బిజెపిపై చేసిన విమర్శలను గమనంలో తీసుకోకుండా కాంగ్రెస్‌ ఆయనపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. శివసేన విషయానికి వస్తే బిజెపి కూటమికి మొదట గండి కొట్టింది తామే గనక జాతీయ స్థాయిలోనూ ఉద్ధవ్‌కే పెద్దపీట వేసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఆ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. గతంలో శివసేనను బిజెపి సహజనేస్తంగా చెప్పేవారు. మౌలిక సిద్ధాంతాల నుంచి (అంటే అసలైన హిందూత్వ నుంచి) బిజెపి వైదొలగింది గనకే తాము దూరమైనామని ఉద్ధవ్‌ ఉవాచ. కె.సి.ఆర్‌ తో భేటీ సందర్భంలోనూ బిజెపి అనుసరించేది హిందూత్వ కాదని ఆయన అనడం యాదృచ్ఛికం కాదు. ముంబయి సమావేశానికి ముందు హైదరాబాదులో అంగరంగ వైభోగంగా జరిగిన రామానుజ విగ్రహావిష్కరణ దాదాపు బిజెపి క్రతువు లాగే నడిచింది. మోడీతో సహా హాజరై హిందూత్వ రాజకీయాలు వల్లించి వెళ్లారు. విగ్రహ స్థాపకులైన చినజీయర్‌ స్వామి మోడీపై ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత స్థాయిలో కెె.సి.ఆర్‌ ప్రధానితో రాష్ట్రపతితో కలసి పాల్గొనకపోయినా వారికన్నా ముందు వెళ్లివచ్చారు. ఆయన ప్రభుత్వ పూర్తి అండతోనే తాము ఇదంతా చేయగలిగామని చినజీయర్‌ స్వామి పలుసార్లు చెప్పారు. అంతకు ముందు యాదాద్రి ప్రారంభోత్సవానికి మోడీని పిలిచి వచ్చిన కెె.సి.ఆర్‌ ఇప్పుడు కొంత వ్యవధి తీసుకుంటున్నా ఆహ్వానించే విషయం ఆలోచిస్తామని అంటున్నారే గాని తోసిపుచ్చలేదు.

  • ప్రత్యామ్నాయాలు, విఘాతాలు

ప్రాంతీయ పార్టీల నేతలు చాలామందికి జాతీయ నాయకత్వం ప్రధాని పదవి గురించిన ఆశలు వ్యూహాలు వుండవచ్చు గాని దానికి ప్రాతిపదిక ఏమిటి? యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ వంటి వారి ఉదాహరణలు చెబుతుంటారు. అప్పుడు జనతాదళ్‌ జాతీయ పార్టీగా వుండటం, వందకు పైగా స్థానాలు గల కాంగ్రెస్‌ వామపక్షాలు బలపర్చడం వల్లనే అది సాధ్యపడింది. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబాసు, వి.పి.సింగ్‌ వంటి హేమాహేమీలు దాని వెనక వున్నారు. ఓడిపోయిన ప్రధాని పి.వి.నరసింహారావు కూడా దేవెగౌడను బలపర్చారు. తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు భక్తులు దీనంతటిని విస్మరించి ఆయనే కింగ్‌ మేకర్‌ అని పొగిడి పరవశిస్తుంటారు. చంద్రబాబును ఫ్రంట్‌ కన్వీనర్‌గా ప్రతిపాదించింది సూర్జిత్‌. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి చంద్రబాబు 1998లో బిజెపి-ఎన్‌డిఎ-వాజ్‌పేయి ప్రభుత్వం వైపు దూకడం చరిత్రలో అతి పెద్ద పిల్లిమొగ్గ. 2009లో వామపక్షాలతో పని చేసి 2014లో మళ్లీ బిజెపి కూటమిలో చేరడం, అధికారం పంచుకుని అభాసుపాలు కావడం చెరిగిపోని సత్యాలు. 2019 ఎన్నికలకు ముందు బయిటకు వచ్చి కాంగ్రెస్‌తో చేతులు కలపడం, తెలంగాణలో మాత్రమే పొత్తు పెట్టుకోవడం దారుణమైన ఫలితాలకు కారణమైనాయి. ఆ సమయంలో చంద్రబాబు ప్రధాని కావడం గురించి తెలుగుదేశం నాయకులు వారి అనుకూల మీడియా వండి వార్చిన కథనాలు ఇన్నీ అన్నీ కావు. తీరా 2019లో మోడీ తిరిగివచ్చాక బిజెపిపై టిడిపి పూర్తిగా మౌనం వహిస్తూ దాదాపు అనుకూలత పాటిస్తున్నది. అదే విధంగా పవన్‌ కళ్యాణ్‌ జనసేన బిజెపితో జట్టు కట్టి తిరుగుతున్నది. వీరివురూ కూడా బిజెపి మార్కు ఆలయాలు, మతాల ఎజెండానే మాట్లాడుతున్నారు. ఇక కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమైనారని నిరంతరం ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ తను ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాతో సహా అన్నిటిపై గప్‌చిప్‌. రాష్ట్ర ప్రజలనూ ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రావలసింది సాధించుకునే బదులు మోడీ సర్కారు ఒత్తిడికి, బెదిరింపులకు తాను లోబడిపోయిన స్థితి. పార్లమెంటులో చాలా వరకూ కేంద్రానికి అనుకూలంగానే ఓటు చేస్తున్నారు. జగన్‌, కె.సి.ఆర్‌ ల సాన్నిహిత్యం గురించి గతంలో వినిపించినా టిఆర్‌ఎస్‌ నేతలు ఇటీవల బిజెపికి ఆయన లొంగిపోవడం గురించి చెబుతున్నారు. తనపై బిజెపి చేసే మతపరమైన విమర్శలకు జవాబుగా తానూ హిందూత్వలో వెనకబడలేదని చూపించుకోవడానికి జగన్‌ తంటాలు పడుతుంటారు.

  • ఏదైనా ఎన్నికల తర్వాతే!

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చాలావరకూ బిజెపికి అనుకూలంగానో తటస్థంగానో వుంటున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం జరిగే పోరాటంలో కూడా పెద్దగా గొంతు కలుపుతున్నది లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్రాల హక్కుల కోసమూ బిజెపి మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడుతుంటారు. ఎస్‌.పి, ఆర్‌.జె.డి బిజెపిని వ్యతిరేకిస్తున్నాయి. బిఎస్‌పి నాయకురాలు మాయావతి ఎస్‌.పి పైనే ఎక్కువగా దాడి ఎక్కుపెడుతూ బిజెపి కి పరోక్షంగా మేలు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కేజ్రీవాల్‌ బిజెపి తో రాజకీయ ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారనే అభిప్రాయం వుంది. బిజెపి భాగస్వామి నితీశ్‌ కుమార్‌ గురించీ అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. ఆయన గతంలో ఒకసారి ఎన్‌డిఎకు దూరమై గెలిచిన తర్వాత మళ్లీ జట్టు కట్టిన తీరు మర్చిపోలేము. నితీశ్‌ ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అవుతారనే ప్రస్తుత కథనాలను ఆయన కావాలనే సాగనిస్తున్నారు. వీరందరి మధ్యనా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచరిస్తుంటారు. ఆయన ఎవరికి దూరం ఎవరికి దగ్గర అనేది మరో పెద్ద ప్రహేళిక. బిజెపి ని ఓడించడం అసంభవం కాదుగాని కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడం సమస్య అని ఆయన చెబుతుంటారు. కాని కాంగ్రెస్‌లో చేరాలని విఫలయత్నం చేశారు! జాతీయ దృశ్యం ఎంత గజిబిజిగానూ అవకాశవాద పోకడలతోనూ నిండివుందో అర్థం కావడానికి ఈ ఉదాహరణలు చాలు. గతంలో ఎప్పుడైనా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే కేంద్రంలో ఏ సంఘటనలు, కూటములైనా ఏర్పడ్డాయి. అప్పుడే ఎవరి కోణంలో కూటముల గురించీ, వాటి నాయకత్వాల గురించీ మాట్లాడ్డం ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది. బిజెపి బలం పెరగడం, కాంగ్రెస్‌ బాగా బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలకు మరింత ప్రాధాన్యత కొత్త పరిణామాలు కావచ్చు. కానీ మరోవైపున మోడీ నిరంకుశ పోకడలపై మత రాజకీయాలపె ప్రజలౖ నిరసనలు, రైతాంగ ఉద్యమాలు...వంటివి విజయాలు సాధించడం కూడా చూస్తున్నాం. గతం కన్నా నగంగా కార్పొరేట్‌ ప్రైవేటీకరణ అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను, మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించే ప్రతిఘటన పెంపొందించడమే నేటి తక్షణావసరం అవుతుంది. అందులో ఎవరు ఏమేరకు పాలుపంచుకుంటారు, ఎన్నికల పోరాటం ఎలా వుంటుంది అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే. ఆ క్రమంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా బలీయమైన ప్రభావం చూపించవచ్చు.

ప్రాంతీయ నేతలు, జాతీయ స్వప్నాలు?
- తెలకపల్లి రవి