May 30,2021 14:01

కరోనా వేళ ప్రొటీన్లు ప్రతి ఒక్కరికీ అవసరం. పెసలు, శనగలు, కందులు, మినుములు తదితర పప్పులను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటాం. వీటిలో ప్రొటీన్లు పుష్కలం. అయితే వీటితో కాస్త కొత్తగా రెసిపీలను చేసుకుంటే.. పిల్లలూ పేచీ లేకుండా ఇష్టంగా తింటారు.

                                                                       దాల్‌ మఖాని

దాల్‌ మఖాని

కావలసిన పదార్థాలు : నల్ల మినప్పప్పు - రెండు కప్పులు, అల్లం - చిన్నముక్క, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, షాజీర - రెండు టీస్పూన్లు, మెంతులు - ఒక టీస్పూన్‌, టొమాటో ప్యూరీ - రెండు కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉప్పు - తగినంత.
 

తయారుచేసే విధానం : ముందుగా కుక్కర్‌లో పప్పు వేసి, అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి, కొద్దిగా వేడి అయ్యాక వెన్న వేయాలి. తరువాత నూనె వేసి, కాస్త వేడయ్యాక షాజీర, మెంతులు వేసి వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ వేయాలి. కారం, పంచదార, తగినంత ఉప్పు వేసి, మరికాసేపు వేగనివ్వాలి. చిన్నమంటపై నూనె పైకి తేలే వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు వేయాలి. పప్పు మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. చివరిగా పచ్చిమిర్చితో గార్నిష్‌ చేసుకోవాలి.

                                                                         కబాబ్స్‌

 కబాబ్స్‌

కావలసిన పదార్థాలు : మినుములు - రెండు కప్పులు, కారం - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - పావు టీస్పూన్‌, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కొత్తిమీర - కొద్దిగా, కొబ్బరితురుము - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.

తయారుచేసే విధానం : ముందుగా మినుముల్ని రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినుములలో నుంచి నీళ్లను తీసివేసి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము, కొత్తిమీర తగినంత ఉప్పు వేసి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కబాబ్‌లుగా చేసుకోవాలి. వీటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఇవి సాస్‌ లేదా చట్నీతో వేడివేడిగా తింటే బాగుంటాయి.

                                                                           ఢోక్లా

ఢోక్లా

కావలసిన పదార్థాలు : పెసలు - అరకప్పు, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, రవ్వ - ఒక టేబుల్‌స్పూన్‌, శనగపిండి - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, పంచదార - నాలుగు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఈనో పౌడర్‌ - ఒక టీస్పూన్‌.

తయారుచేసే విధానం :  పెసలను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన నీళ్లు తీసివేసి, పచ్చిమిర్చి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని.. అందులో రవ్వ, శనగపిండి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నీళ్లు పోసి, మరిగించాలి. ఈలోగా ఢోక్లా మేకింగ్‌ ప్లేట్లకు నూనె రాసి, పెట్టుకోవాలి. మిశ్రమంలో ఈనో కలపాలి. ఈనో కలిపిన వెంటనే మిశ్రమంలో బుడగలు వస్తాయి. మిశ్రమం రెట్టింపవుతుంది. వెంటనే మిశ్రమాన్ని ప్లేట్లలో పోయాలి. ప్లేట్లను కుక్కర్‌లో పెట్టి, పావుగంట పాటు ఉడికించాలి. ఆవిరిపోయిన తరువాత తీసి, సర్వ్‌ చేసుకోవాలి.
 

                                                                           దాల్‌ చిల్లా

 దాల్‌ చిల్లా

కావలసిన పదార్థాలు :  పెసరపప్పు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఆలివ్‌ ఆయిల్‌ లేదా నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, టోఫు (పన్నీరు ముక్కలు) - 200గ్రా, ఉల్లిపాయలు - రెండు, పసుపు - అర టీస్పూన్‌.

తయారుచేసే విధానం : ముందుగా పప్పును శుభ్రంగా కడిగి, నీళ్లలో రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి, నూనె లేదా నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని వెడల్పుగా స్పూన్‌తో దోశలా పోసుకోవాలి. రెండు, మూడు నిమిషాలు కాలిన తరువాత మరోవైపు తిప్పి, కాల్చుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌పెట్టి, నూనె వేయాలి. వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, బాగా వేగించాలి. తరువాత పసుపు వేసి, తగినంత ఉప్పు వేయాలి. కాసేపు వేగిన తరువాత టోఫు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగించాలి. కొత్తిమీర వేయాలి. ఇప్పుడు కాల్చి పెట్టుకున్న దోశలపై ఈ మిశ్రమం పెట్టి, తింటే భలే రుచిగా ఉంటుంది.