Mar 06,2023 20:48

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటును వినియోగించుకుంటున్న ఉద్యోగి

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటును వినియోగించుకుంటున్న ఉద్యోగి
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు
నెల్లూరు :ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గాల ఉపాధ్యాయుల, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ విధులకు హాజరవుతున్న పలువురు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన సూక్ష పరిశీలకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో వినియోగించుకున్నారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు, ఎస్‌పి సిహెచ్‌ విజయరావు, జాయింట్‌ కలెక్టర్‌ కూర్మానాథ్‌, నోడల్‌ అధికారులు వెంకట్రావు, శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన నగరంలోని విఆర్‌ పిజి కళాశాలలో నిర్వహించే ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి హాజరైయ్యే సిబ్బందికి సైతం మరో నాలుగు ప్రత్యేక పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.