నల్లగా నిగనిగలాడే తాటిపండు గురించి నేటితరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ దీనిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెట్టు నుండి పడీ పడగానే తెచ్చుకోవాలి. ఒక్కరోజు ఆలస్యమైనా అవి పాడైపోతాయి. పోషకాలలో మేటి అయిన ఈ తాటి పండుతో వెరైటీగా ఏమేం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు : తాటిపండు- ఒకటి, ఇడ్లీ నూక- 2 కప్పులు, పంచదార- కప్పు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారుచేసే విధానం :
- తాటిపండును నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
- తర్వాత దానిని నేలపై కొంచెం గట్టిగా కొట్టాలి. అప్పుడు తాటిపండు మెత్తపడి, గుజ్జు తీయడం సులభమవుతుంది.
- నెమ్మదిగా తాటిపండు తొక్క తీయాలి. తాటి టెంకలను విడివిడిగా తీసి, వాటి నుంచి గుజ్జును తీయాలి.
- ఎండుకొబ్బరి తురిమే ప్లేటుపై పండులోని ఒక్కో విత్తును తీసుకుని గుజ్జును తీసుకోవాలి.
- తర్వాత ఈ గుజ్జులో ఇడ్లీ నూక, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి, గంట నానబెట్టాలి.
- ఇడ్లీప్లేట్లలో తాటిపిండిని ఇడ్లీలు మాదిరిగా పెట్టి, ఉడికిన తర్వాత స్టౌపై నుంచి దించాలి.
- ఇవి చూడటానికి పసుపు వర్ణంలో, విభిన్న రుచిలో చాలా రుచిగా ఉంటాయి.
కేక్
కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు - కప్పు, గోధుమపిండి- కప్పు (నిండుగా), కొబ్బరితురుము- ముప్పావు కప్పు, బెల్లం తురుము- ముప్పావు కప్పు, నెయ్యి- కప్పు.
తయారుచేసే విధానం :
- ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో తాటిపండు గుజ్జు, గోధుమ పిండి, కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి, బాగా కలిసేలా కలపాలి. చివరిలో నెయ్యి పోయాలి. తర్వాత గంట నానబెట్టాలి.
- కేక్‌బౌల్‌కు కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమం పోసుకోవాలి. దీనిని కేక్ ఓవెన్‌లో పెట్టి సన్నని సెగపై గంటసేపు స్టౌమీద ఉంచాలి. కేక్ రెడీ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవాలంటే టూత్‌పిక్‌తో గానీ, స్పూన్ కాడతో గాని గుచ్చి చూడాలి. దానికి పిండి అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్లు.
- ఒక ప్లేట్‌లోకి కేక్ బౌల్‌ను తిప్పి పెడితే తయారైన కేక్ ప్లేట్‌లోకి వస్తుంది.
- ఈ కేక్ వారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
బూరెలు
కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు- కప్పు, తురిమిన బెల్లం- 1/2 కప్పు, యాలకుల పొడి- 1/4 స్పూను, ఎండు కొబ్బరిపొడి- 2 స్పూన్లు, బియ్యంపిండి- 1 1/4 కప్పు.
తయారుచేసే విధానం :
- బాగా పండిన తాటిపండును తీసుకుని, పైన ఉండే పీచును ముందుగా తీసెయ్యాలి. దానిని గట్టిగా ఒత్తితే మూడు భాగాలుగా విడిపోతుంది. అప్పుడు దాన్ని కొబ్బరి తురిమే ప్లేటుతో తురుముకోవాలి.
- తాటిపండు గుజ్జును ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులో బెల్లం వేయాలి. అది బాగా కరిగాక యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము, బియ్యంపిండిని కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిసేలా కలపాలి. పిండి మరీ పలుచగా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి.
- ఆ పిండిని బూరెల్లాగే చేసుకుని, నూనెలో తక్కువ మంటమీద ఎక్కువసేపు వేయించాలి. ఇవి వారం వరకూ పాడవకుండా ఉంటాయి.
గారెలు
కావాల్సిన పదార్థాలు : తాటిపండు గుజ్జు- కప్పు, తురిమిన బెల్లం- 1/2 కప్పు, మినపప్పు- కప్పు, బియ్యంపిండి- కొద్దిగా, ఉప్పు - కొద్దిగా.
తయారుచేసే విధానం :
- మినపప్పును నాలుగు గంటలు నానబెట్టుకుని రుబ్బుకోవాలి. తాటిపండు గుజ్జును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో బెల్లం వేసి కరిగే వరకూ తిప్పాలి.
- తర్వాత రుబ్బుకున్న మినపప్పుని, బియ్యంపిండిని, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.
- ఆ పిండిని గారెలాగా ఒత్తుకుని, మధ్యలో చిల్లుపెట్టి నూనెలో తక్కువమంటలో వేయించాలి. అంతే తాటిపండు గారెలు రెడీ. ఇవీ రెండు రోజులు నిల్వ ఉంటాయి.