Mar 04,2022 07:50
  • నేడు సిఎం, కేంద్ర మంత్రి రాక

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నేడు (శుక్రవారం) కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పునరావాస కాలనీల్లో పర్యటించనున్నారు. ఇందు కూరుపేట-1,తడువాయి కాలనీల్లో పర్యటించనున్న వీరు అక్కడి లభ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడ నున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారికంగా కార్యక్రమం ఖరారైంది. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అత్యంత కీలకమైన నిర్వాసితుల ముఖాముఖిలో వాస్తవ సమస్యల ప్రస్తావన రాకుండా చూడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. మూడు రోజుల ముందు నుంచే అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో ఆర్‌డిఒ స్థాయి నుంచి విఆర్‌ఒ స్థాయి వరకూ అధికారులు కలియతిరుగుతున్నారు. కొందరిని ఎంపిక చేసి ఏం మాట్లాడాలో శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ముఖాముఖిలో వీరి చేతనే మాట్లాడిస్తారని అంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి పరిహారం, ప్యాకేజీలు అందవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 

                                                                         కొత్త జిల్లా కోసం ఆందోళన

పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చింతూరు నుంచి పాడేరుకు సుమారు 400 కిలో మీటర్లు దూరం ఉంది. అంతదూరం స్థానికులు వెళ్ల్ల్ల్లాల్సివస్తుంది. మరో వైపు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజక వర్గంలోని 5 షెడ్యూలు మండలాలను ఏలూరు జిల్లాలో కలుపుతామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం ఫలితంగా పోలవరం నిర్వాసితులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని 11 మండలాలు, పశ్చిమ ఏజెన్సీలోని 5 మండలాలు, ప్రతిపాదనలో ఉన్న మరో 2 మండలాలు, షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని ఇక్కడి ప్రజలు కోరతున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. జెఎసి ఆధ్వర్యంలో నూతన జిల్లా ఏర్పాటు కోసం ప్రచారజాతా కూడా సాగుతోంది. కొంత మంది వైసిపి ప్రజాప్రతినిధులు సైతం నూతన జిల్లా ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఎం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
 

                                                        హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి : అరుణ్‌

ఎన్నికల ముందు నిర్వాసితులకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి అరుణ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, పరిహారం, పునరావాసం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులూ కల్పించాలని కోరారు. కాంటూర్‌ లెక్కలను రెండేళ్లుగా వచ్చిన వరదలు తారుమారు చేశాయని, ఈ మేరకు మళ్లీ సర్వే నిర్వ హించి మిగిలిన గ్రామాలనూ ముంపు ప్రాంతాల్లో చేర్చి పరిహారం, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం కేంద్రంగా నూతన ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.