పోలవరం : పోలవరం ప్రాజెక్టు పనులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సోమవారం పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి ఎల్‌ఎన్‌డి పేట వద్ద నిర్మించిన పునరావాస కాలనీకి వెళ్లారు. అక్కడున్న నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణంలో ఎపి ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు కానీ, పోలవరం ప్రాజెక్టును మాత్రం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని అనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.11 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ నిధుల్లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.11 వేల కోట్లు, పునరావాసానికి రూ.4 వేల కోట్లను ఖర్చు చేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ముంపులో ఉన్న నిర్వాసితులకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి, అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.










