Dec 18,2020 07:57

     ప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పవలసింది ప్రాజెక్టు ఎత్తు కొలతలు గురించి కాదు. విజభన చట్టం మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి నిధులతో నిర్మించేందుకు పోరాడతానని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వవలసి వుంది. కనీసం రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఆమోదించిన రూ. 47,725.74 కోట్ల అంచనాలు కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింప చేయించుకున్నపుడే...ముఖ్యమంత్రి క్రమానుగత పథకం గురించి రాష్ట్ర ప్రజలు వింటారు. వి. శంకరయ్య
పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న మొన్నటి వరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చేస్తుండిన ప్రసంగాలనే తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచి కూడా తగ్గించబడదని ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దశలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ఎవరు యత్నించినా సాధ్యం కాదు కూడా. సాంకేతికంగా కనీస పరిజ్ఞానం వున్న వారెవ్వరూ అలా భావించ లేరు. కాకుంటే నీళ్లు నిల్వ చేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు అసలు సమస్య కాదు. ఒకటి- కేంద్ర జల వనరుల శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఆమోదించిన ప్రాజెక్టు వ్యయం రూ.47 725.74 కోట్లు కేంద్రం భరిస్తుందా? ఇందుకు కేంద ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేస్తుందా? రెండు- ఇటీవల ప్రాజెక్టు పనులు తనిఖీ చేసిన నిపుణుల కమిటీ సూచనలు ఏ మేరకు అమలు జరుగుతాయి? కీలకమైన ఈ అంశాలు వదలి పెట్టి అధికార ప్రధాన ప్రతిపక్షాలు ప్రాజెక్టు ఎత్తు కొలతలపై సవాళ్లు చేసుకుంటున్నారు.
      భారత దేశంలో పలు ప్రాజెక్టులు నిర్మింపబడుతున్నా పోలవరం ప్రాజెక్టు భిన్నమైనది. ఏ ప్రాజెక్టుకైనా నదీ గర్భంలో అడ్డుగా ఆనకట్ట నిర్మిస్తారు. కాని పోలవరం ప్రాజెక్టులో గేట్లుతో కూడిన ప్రధాన ఆనకట్ట స్పిల్‌ వే నది పక్కన నిర్మిస్తున్నారు. వరద నీరు స్పిల్‌ వే నుండి దాదాపు ఒక కిలో మీటరు ప్రవహించి తిరిగి నదిలో కలుస్తుంది. నదీ గర్భంలో నీటి ఊటను కట్టడి చేసే డయాఫ్రమ్‌ వాల్‌ తో కూడిన ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం ఒక పెద్ద కొండ లాంటిది నిర్మింపబడుతుంది. ఇంత వివరణ ఎందుకంటే గేట్లుతో కూడిన స్పిల్‌ వే నిర్మాణం ముగింపు దశలో వుంది. గేట్లు బిగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్నా సాంకేతికంగా కుదిరే అవకాశాలు లేవు. అసలు సమస్య ఏమంటే ఏ మేరకు నీళ్లు నిలుపుతారు? ఏ మేరకు నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకం అమలు జరుగుతుంది? ఇవి అత్యంత కీలకమైనవి. పైగా ఈ ప్రాజెక్టులో వివిధ విభాగాలు ఒక దానికొకటి లింకు ఏర్పడి వుంది. తొలుత స్పిల్‌ వే - స్పిల్‌ చానల్‌ పూర్తి అయిన తర్వాతనే కాఫర్‌ డ్యాం గ్యాప్‌ లు పూడ్చమని ఇటీవల వచ్చిన నిపుణుల కమిటీ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఆ మేరకు నష్టపరిహారం పునరావాసం పూర్తి చేసి గ్యాప్‌ లు పూడ్చమని కూడా చెప్పింది. ఎందుకంటే నిర్వాసితుల గురించి పట్టించుకోకుండా కాఫర్‌ డ్యాం గ్యాప్‌ లు పూడ్చితే వరద కాలంలో తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణుల కమిటీ చెప్పింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకంతో పాటు స్పిల్‌ వే స్పిల్‌ చానల్‌ పనులు పూర్తి అయిన తర్వాతనే కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయమని చెప్పింది. ఇదంతా పూర్తి అయిన తర్వాత నదీ గర్భంలో ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణం మొదలు పెట్టవలసి ఉంది.
        నిర్వాసితుల గురించి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ ఇప్పుడు పెద్ద సమస్య కానే కాదు. స్వల్ప నిధులతో పూర్తి అవుతుంది. ప్రస్తుతం సమస్య నిర్వాసితులకు ఇవ్వవలసిన నష్టపరిహారం, వారికి కల్పించలసిన పునరావాసమే.
        ముఖ్యమంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్టు ఎత్తు పొడుగుల కొలతలు గురించి చెబుతున్నారు. అంతేతప్ప రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం తన నిధులతో నిర్మించి ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. గమనార్హమైన అంశమేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెబుతుంది. కేంద్ర జలవనరుల శాఖ మరొక లెక్క చెబుతోంది. తుదకు కేంద్ర ఆర్థిక శాఖ తోక కోసి సున్నం పెడుతోంది. కేంద్ర జలవనరుల శాఖ రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఆమోదించిన వ్యయమైనా కేంద్ర ప్రభుత్వం భరించకపోతే పోలవరం ప్రాజెక్టు ఎత్తు నిర్ణీత ప్రకారం నిర్మించ వచ్చుగాని ప్రాజెక్టులో నీళ్లు నిలపడం మాత్రం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని ముఖ్యమంత్రి నుండి గాని ఈ అంశంపై స్పష్టత రావడం లేదు. గత ప్రభుత్వం వేసిన చిక్కుముడులు విప్పుకొస్తున్నామని చెబుతున్నారే గాని రికార్డు పరంగా జరిగిన లోపాలను బహిర్గతం చేయడం లేదు. అదే సమయంలో చట్ట బద్దంగా కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించ వలసిన బాధ్యతను నిలదీయడం లేదు.
       జనవరి 2019లో టిడిపి హయాంలోనే తీవ్ర తర్జనభర్జనల మధ్య కేంద్ర జలవనరుల శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు తాజా అంచనాలను రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తదుపరి అదే శాఖకు చెందిన రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ రూ. 47,725.74 కోట్ల అంచనాలు ఆమోదించింది. సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అంచనాల్లో కోత విధించింది. ఇక్కడే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం ఇమిడి వుంది. ఒకవైపు ఈ అంచనాలను ఆమోదించి పంపుతూ మరోవైపు 2013-14 అంచనాల మేరకు విద్యుత్‌కు, తాగునీటికి చెందిన మొత్తాలను మినహాయించి రూ. 20,398.61 కోట్లకు మరొక ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపింది. 2013-14 అంచనాలు ఇవ్వాలని 2017లో కేంద్ర మంత్రి వర్గం తీర్మానం చేసి వుంటే 2019లో సాంకేతిక సలహా కమిటీ రూ.55,548.87 కోట్లకు, తాజాగా రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ రూ. 47,725.74 కోట్లకు అంచనాలను గమనంలోనికి ఎందుకు తీసుకున్నది? అంతే కాదు. పార్లమెంటు ఆమోదించిన  చట్టాన్ని కేంద్ర మంత్రి వర్గం ఎలా మార్పు చేస్తుంది ?
        ఇవన్నీ అటుంచగా ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెబుతుంటే సాంకేతిక సలహా కమిటీ రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ వేర్వేరు లెక్కల అంచనాలు వేశాయి. ఈ గణాంకాలను పరిశీలించితే పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకనే ముఖ్యమంత్రి దశల వారీ పథకం తెర మీదకు తెచ్చారనిపిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖకే చెందిన సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరల మేరకు ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లు అంచనా వేసి అందులో రూ. 33 వేల కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకం కింద కేటాయించింది. తీరా రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ అదే ధరల మేరకు రూ. 47,725.74 కోట్లుగా మదింపు వేసి ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకాన్ని రూ. 28 వేల కోట్లకు దించింది.
       ఇదిలా వుండగా 45.72 (150 అడుగులు) మీటర్ల మేర ప్రాజెక్టు నిర్మించితే ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకానికి రూ. 16,868.98 కోట్లు సరిపోతాయని 84,781 కుటుంబాలను తరలించ వలసి వుంటుందని సమాచార హక్కు చట్టం కింద ఒకరు అడిగితే కేంద్ర జలవనరుల శాఖ జవాబు ఇచ్చింది. అదే 41.15 (135 అడుగులు) మీటర్ల ఎత్తు అయితే రూ. 2,020.72 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకానికి సరిపోతుందని కూడా సమాచారం ఇచ్చింది. ఇప్పుడు మొత్తం వ్యవహారం ఒక మిస్టరీగా మిగిలి పోయింది. రూ. 33 వేల కోట్ల వ్యయమౌతుందని భావించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ పథకం రూ. రెండు వేల కోట్లతో ముగింపు దశకు చేరింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పవలసింది ప్రాజెక్టు ఎత్తు కొలతలు గురించి కాదు. విజభన చట్టం మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి నిధులతో నిర్మించేందుకు పోరాడతానని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వవలసి వుంది. డ్యాం సేఫ్టీ అండ్‌ స్టెబిలిటీ ప్రోటోకాల్‌ కింద క్రమానుగతంగా నీళ్లు నిల్వ చేస్తానని చెబితే చాలదు. కనీసం రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఆమోదించిన రూ. 47,725.74 కోట్ల అంచనాలు కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింప చేయించుకున్నపుడే...ముఖ్యమంత్రి క్రమానుగత పథకం గురించి రాష్ట్ర ప్రజలు వింటారు.

వి. శంకరయ్య

వి. శంకరయ్య
(వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు,
సెల్‌ : 98483 94013)