Mar 12,2023 21:29

అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ప్రజాశక్తి-నెల్లూరు :పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రక్రియను పారదర్శంగా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాష్టింగ్‌ నిర్వహించన్నుట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు తెలిపారు. జిల్లాలో ఈ నెల 13వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుచున్న నేపధ్యంలో ఆదివారం డికెడబ్ల్యూ కళాశాలలో నెల్లూరు డివిజన్‌కు సంబం ధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను సందర్శించారు. పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి అధికారులకు, పోలింగ్‌ సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్స్‌ పరిధిలో ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అందులో భాగంగా డివిజన్‌ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఓటర్‌ మార్క్‌ కాపీతో పాటు పోలింగ్‌ సామాగ్రిని సంబంధిత పోలింగ్‌ సిబ్బందికి అందజేశామన్నారు.సాయంత్రానికి పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నేటి ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ మొదలై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వర్తించుటకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుతో పాటు వేసవికాలం దష్ట్యా పోలింగ్‌ రోజున ఓటర్లుకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు గాను 1350 మంది పోలీసు సిబ్బందిని, 1729 మంది పోలింగ్‌ పోలింగ్‌ సిబ్బందిని సిద్దం చేశామన్నారు. ఓటు హక్కును వినియోగించుకొనే సమయంలో ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన పెన్నుతో మాత్రమే మార్క్‌ చేయాల్సి వుంటుందన్నారు. ఓటర్లందరికి ఓటరు స్లిప్స్‌ ను పంపిణీ చేయడం జరిగిందని, ఓటరు ఓటు వేసేందుకు ఓటర్‌ స్లీప్‌ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, భారతీయ పాస్‌ పోర్ట్‌ వంటి 12 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాల్సి వుంటుం దన్నారు. గుర్తించిన క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం పోలింగ్‌ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు వెబ్‌ కాస్టింగ్‌ లైవ్‌ ఏర్పాటుతో పాటు అదనంగా పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశామన్నారు. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్‌ విధానంపై ఓటర్లకు అవగాహన కార్యక్ర మాలను నిర్వహించామన్నారు. పట్టభద్రులు, ఉపాధా ్యయ ఓటర్లందరూ స్వచ్ఛందంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్‌ బాబు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగర పాలక సంస్థ కమీషనర్‌ హరిత, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్‌.డి.ఒ శ్రీ మాలోల ఉన్నారు.