ప్రజాశక్తి-హిందూపురం : పశ్చిమ రాయలసీమ శాసన మండలి ఎన్నికలు సోమవారం జరిగాయి. పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఎంజిఎం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఓటర్లకు, పోలింగ్ బూత్ ఏజెంట్లకు మాత్రమే లోపలకు అనుమతులు ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మేన్ బలరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, కొండూరు వేణుగోపాల్ రెడ్డితో పాటు మరి కొంత మంది నాయకులు పోలింగ్ కేంద్రంలోనే ఉండిాల్‌చల్ చేశారు. వీరిని చూసిన టిడిపి నేతలు అంబికా లక్ష్మినారాయణ, మరి కొంత మంది సర్పంచులు, నాయకులు సైతం లోపలికి వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారు. ఇది గమనించిన డిఎస్‌పి యశ్వంత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. అయితే వారు వినక పోవడంతో శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లి పోయారు.










