Sep 26,2023 21:48

ఫొటో : నిరసన చేపడుతున్న అంగన్‌వాడీ వర్కర్లు

పోలీసుల నిర్బంధంపై సిఐటియు నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమస్యల పరిష్కరించాలని కోరుతూ 25వ తేదీన చలో అమరావతి పిలుపునివ్వగా ఆ కార్యక్రమానికి పోకుండా పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వడం బెదిరింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య హాజరై మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి అనేకమార్లు తీసుకొని పోయినప్పటికీ పరిష్కరించలేదన్నారు.
గత్యంతరం లేని పరిస్థితులలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వారి సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు అంగన్‌వాడీలు హెల్పర్లు 25వ తేదీన చలో అమరావతికి పోయేందుకు ప్రయత్నిస్తుండగా పోవడానికి వీల్లేదంటూ పోలీసులు వారికి ముందస్తు నోటీసులు ఇవ్వడం, వెళితే కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేయడం, వెళ్లే వారిపై పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధం, మార్గం మధ్యలో నిర్బంధం, రైల్వే స్టేషన్లలో నిర్బంధం ఇలా మహిళలు అని కూడా చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడకక్కడ నిర్బంధాన్ని ఉపయోగించి రకరకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా పని భారాన్ని పెంచిందని తెలిపారు. కనీస వేతనాలు గ్రాడ్యుటీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. న్యాయం కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటే పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ఉపయోగించడం చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన కనబడుతుందని నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకొని ఇప్పటికైనా అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారికి కనీస వేతనాలు రూ.26వేలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, రిటైర్డ్‌మెంట్‌ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. వారి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని, ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.తిరుపాలు, బి.కృష్ణయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రఘురావమ్మ, విజయలత, సుభాషిణి, కళావతి, తదితర అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.