బి.కొత్తకోట : పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రతి ఒ్కకరూ పనిచేయాలని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ పోలీస్‌స్టేషనును శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి పర్యాటకులు హార్సిలీహిల్స్‌కు విచ్చేసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారన్నారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. ఇకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించాలన్నారు. పోలీస్ స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులను మర్యాదగా పలకరించాలన్నారు. వారి ఫిర్యాదులను తీసుకొని,విచారణకు సహకరించాలన్నారు. కేసుల దర్యాప్తులో పారదర్శకంగా వ్యవహరించి, అసలు దోషులకు శిక్షపడేవిధంగా చూసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు చెక్ పోస్టులందు ప్రత్యేక నిఘా ఉంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు.ఇక గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. 96 గ్రామాల్లో నాటుసారా విక్రయాలు, వినియోగం ఉందని గుర్తించామన్నారు. మూడు నెలలుగా నాటుసారా కేసులు తక్కువగా నమోదు కావడం హర్షిణీయమన్నారు. జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.ఇక జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 60 హాట్ స్పాట్లను గుర్తించామని, అక్కడ పోలీసులను ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మదనపల్లి డిఎస్‌పి కేశప్ప, రూరల్ శివాంజనేయులు, ఎస్‌ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ రవీందర్ నాయక్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.










