Jul 07,2021 10:12

బిండ్‌ : ఓ వ్యక్తి దొంగతానికి కొత్త. కన్నం వేసిందీ కూడా పోలీస్‌ ఇంట్లో. అయితే తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉండటం కారణంగానే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, తిరిగి డబ్బులు ఇచ్చేస్తానని లేఖ రాయడం కొసమెరుపు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని బిండ్‌ నగరలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బిండ్‌ నగరానికి చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కమలేష్‌ కఠారీ ఇటీవల బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం రాత్రి తిరిగొచ్చారు. ఆ సమయంలో తలుపులు బార్లా తెరచి ఉండటంతో పాటు ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. అంతలో అక్కడే లేఖ దొరగ్గా..అందులో 'నన్ను క్షమించండి. ఇదంతా నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు దొంగతనం చేశాను. మళ్లీ నాకు డబ్బు రాగానే మీ దగ్గర దోచుకుందంతా తిరిగి ఇచ్చేస్తా' అంటూ రాశాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా తెలిసినవారి పనే అని పోలీసులు భావిస్తున్నారు.