పోలేరమ్మ ఉత్సవానికి ముమ్మర ఏర్పాట్లు
ప్రజాశక్తి-అల్లూరు : అల్లూరు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ అల్లూరు పోలేరమ్మ ఉత్సవానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు కావలి మాజీ ఎఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోలేరమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులతో కలసి భారీ సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఇందులో కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సహకారం ఉందన్నారు. 10వ తేదీ మంగళవారం ఉత్సవానికి పెద్దలు ఏర్పాట్లు చేశారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. క్యూ లైన్ ద్వారా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుంటారని కాగా విఐపిలకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. అభిషేకం, అఖండ ప్రతిష్ట, సద్ధి నివేదన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని వ్యాఖ్యానించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు.










