Jan 01,2023 22:04

ఫొటో : ఉత్సవానికి అందంగా ముస్తాబైన పోలేరమ్మ ఆలయం

పోలేరమ్మ ఉత్సవానికి ఆలయం ముస్తాబు
- వైభవంగా గ్రామోత్సవం
ప్రజాశక్తి-అల్లూరు : అల్లూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పోలేరమ్మ ఉత్సవం ఊరు పెద్దల సహకారంతో 3వ తేదీ మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని భక్తులు ముస్తాబు చేశారు. అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మ అమ్మవార్లకు భక్తులు కోలాహలంగా ప్రతి యేటా ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాగా ఒకేసారి ముగ్గురు దేవతామూర్తులను ఊరేగించి ఒకరికి ఒకరు ఎదురుపడకుండా పురవీధులలో మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగించి అమ్మవార్లను కొలువు తీరిన ఆలయాలకు పంపుతారు.
కొత్త ఏడాదిలో ముచ్చటగా ముగ్గురు అమ్మవార్లు ఊరేగింపుగా తమ వాకిళ్ల ముందుకు చేరుకోగానే మహిళలు అందంగా రంగవల్లులు వేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఉదయాన్నే సాంప్రదాయబద్ధంగా మాతమ్మకు పూజలు, అమ్మవారికి అభిషేకం, కుమ్మరి సాంప్రదాయం మేరకు అఖండ ప్రతిష్ట, గంగమ్మకు వెండి చీరతో అలంకారం అలాగే తూర్పు వీధి మహాలక్ష్మమ్మ గుడి వద్ద నుండి కాటంరెడ్డి శివప్రియ ఆధ్వర్యంలో సాంప్రదాయ దుస్తులతో మహిళలు అక్కడకు చేరుకొని 1001 కుండలతో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన సద్దిని ఊరేగింపుగా తీసుకువెళ్లి సద్ది నివేదన కార్యక్రమం చేపడతారు. పోతరాజుకు ప్రత్యేక పూజలు, అమ్మవారి గుడి వద్ద పొంగళ్లను నిర్వహిస్తారు. బైనాడి వారిచే కథా కాలక్షేపం, చలిపిండి పానకాలు, రత్నాలంకారం భక్తులకు అమ్మవారు బంగారు చీరలో ప్రత్యేక దర్శనమిస్తారు. గంగమ్మకు ముత్యాల చీర, నాదస్వర కచ్చేరి, గ్రామదేవతులకు పూజలు-అనుజ్ఞ, తెనాలి వారితో నవదుర్గలు డప్పులు, కులుకు భజనలు, తప్పెట్లు, తీన్మార్‌ బ్యాండ్లు, కేరళ వాయిద్యాలు, మిరుముట్లు విద్యుత్‌ దీపాలతో భారీ ఏర్పాట్లు నిర్వహింస్తారు. యువతను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్‌ హెబ్బా పటేల్‌, రైజింగ్‌ రాజు టీం, పల్సర్‌ బైక్‌ రమణ, మానస టీవీ యాంకర్‌, పాడుతా తీయగా సింగర్స్‌ విచ్చేసి యువతను అలరించి వెళ్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్‌ ఏర్పాటు చేస్తారు. ఇతర దేశాలలు పలు ప్రాంతాలలో స్థిరపడ్డ అనేకమంది విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇదిలా ఉండగా గంగమ్మ, కలగోళమ్మ, పోలేరమ్మ ఆలయాల నుండి శోభాయమానంగా విద్యుత్‌ దీపాలతో భారీ కటౌట్లు, ఊరంతా విద్యుత్‌ దీపాలు వెలిగించడంతో పండుగ వాతావరణం నెలకొంది.